జహీరాబాద్, జూలై 3: తెలంగాణ రాష్ట్రంలో చెరుకు పంటను అధికంగా జహీరాబాద్ డివిజన్‌లోనే సాగు చేస్తారు. జహీరాబాద్ మండలంలోని కొత్తూర్(బి) గ్రామంలో ట్రైడెంట్ చక్కెర ఫ్యాక్టరీ ఉంది. ఈ ఫ్యాక్టరీ పరిధిలో అధికంగా రైతులు చెరుకు సాగు చేస్తారు. ఫ్యాక్టరీ యాజమాన్యం టన్నుకు రూ.3050 రైతులకు మద్దతు ధర చెల్లిస్తున్నది. గతేడాది 2022-23 సీజన్లో రైతులు ఫ్యాక్టరీకి చెరుకు సరఫరా చేసినా ఇంతవరకు డబ్బులు చెల్లించలేదు. రైతులకు ఫ్యాక్టరీ యాజమాన్యం రూ.12.05 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఉద్యోగులకు ఆరు నెలల నుంచి జీతాలు కూడా చెల్లించడంలేదు. దీంతో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీర్ హరీశ్‌రావును హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో షుగర్ కేన్ కమిషన్, కలెక్టర్ శరత్, ఎస్పీ రమణకుమార్, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్‌రావు, డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్, సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్‌లతో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి ట్రైడెంట్ చక్కెర ఫ్యాక్టరీ యాజమాన్యం హాజరైంది.
రైతులకు రూ. 12.05 కోట్లు బకాయిలు
ట్రైడెంట్ చక్కెర ఫ్యాక్టరీ యాజమాన్యం రైతుల నుంచి చెరుకు కొనుగోలు చేసినా డబ్బులు పూర్తిగా చెల్లించలేదు. సీజన్ ముగిసి ఐదు నెలలు గడించినా ఇంతవరకు పెండింగ్ బిల్లులు ఇవ్వలేదు. దీంతో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు చెరుకు రైతుల సమస్యలను మంత్రి తన్నీర్ హరీశ్‌రావు దృష్టికి తీసుకుపోయారు. వెంటనే మంత్రి హరీశ్‌రావు కలిపించుకుని కలెక్టర్ శరత్, ఎస్పీ రమణకుమార్తో మాట్లాడి, ఫ్యాక్టరీకి వెళ్లి పరిశీలించాలని ఆదేశాలు ఇచ్చారు. మంత్రి ఆదేశాలతో జిల్లా అధికారులు ఫ్యాక్టరీని పరిశీలించి, ఎంత చక్కెర నిల్వ ఉంది. ఎంత మొలసిస్ ఉందో పరిశీలించి మంత్రికి నివేదిక పంపించారు. ఫ్యాక్టరీకి 50 ఎకరాల భూమి ఉంది.. ప్యాక్టరీలో రూ.30 కోట్లు యంత్రాలు ఉంటాయని నివేదిక సమర్పించారు. రైతులకు పెండింగ్ బకాయిలు చెల్లించేందుకు రెవెన్యూ రికవరీ చట్టం ఉపయోగించేందుకు జిల్లా అధికారులు చర్యలు తీసుకున్నారు. రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం మొత్తం 5 నోటీసులు జారీ చేయాల్సి ఉండగా, ఒక నోటీసును జారీ చేశారు.
జూలై 15 వరకు బకాయిల చెల్లింపు
హైదరాబాద్‌లో మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ట్రైడెంట్ యాజమాన్యం జూలై 15 వరకు రైతుల పెడింగ్ బిల్లులు చెల్లిస్తామని లిఖిత పూర్వంగా రాసిఇచ్చారు. గతంలో చెరుకు రైతులకు యాజమాన్యం పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే రెవెన్యూ రికవరీ చట్టాం ఉపయోగించి, వాహనలు వేలం వేశారు. రాష్ట్ర ప్రభుత్వం చెరుకు రైతుల సమస్యలు పరిష్కారం చేసేందుకు ఎప్పుడు ముందు ఉంటుంది. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు, సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్‌లు పలుమార్లు మంత్రికి చెరుకు రైతుల సమస్య వివరించడంతో పెండింగ్ బిల్లుల చెల్లించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కలెక్టర్ శరత్ ఫ్యాక్టరీని పరిశీలించి నివేదికను ప్రభుత్వానికి సమర్పించడంతో రైతుల సమస్య పరిష్కారం దిశగా ముందుకు పోతుంది. ఫ్యాక్టరీకి చెరుకు సరఫరా చేసిన రైతులు పలు మార్లు అధికారులకు పెం డింగ్ బిల్లులపై ప్రశ్నంచినా స్పదించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కలిపించుకోవడంతో యాజమాజన్యం పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని ముందుకొచ్చారు.
రైతుల సమస్య పరిష్కరిస్తాం
జహీరాబాద్ మండలంలోని కొత్తూర్(బి) గ్రా మంలో ఉన్న ట్రైడెంట్ చక్కెర ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులకు పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో వెంటనే సమస్యను రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకపోయాం. మంత్రి కలిపించుకుని ఫ్యాక్టరీ యాజమాన్యం, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. జహీరాబాద్ జోన్ పరిధిలో ట్రైడెంట్ చక్కెర ఫ్యాక్టరికి చెరుకు సరఫరా చేసిన రైతులకు రూ. 12.05 కోట్లు బకాయిలు ఉన్నారు. ఉద్యోగులకు ఆరు నెల జీతాలు చెల్లించాల్సి ఉంది. రైతులకు, ఉద్యోగులకు బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. ప్రభుత్వం చెరుకు రైతుల సమస్యలు పరిష్కారం చేసేందుకు ఎప్పుడు కృషి చేస్తుంది.
– కొనింటి మాణిక్‌రావు, ఎమ్మెల్యే జహీరాబాద్