దుబ్బాక, మార్చి17: కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే గురుకులాలు, వసతి గృహాల్లో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి సోమవారం అసెంబ్లీలో విమర్శించారు. దుబ్బాక నియోజకవర్గంలోని హబ్షీపూర్ మహాత్మా జ్యోతిబాపూలే గురుకులంలో 7వ తరగతి విద్యార్థి అఖిల్ ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటనపై ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
విద్యార్థికి ఆత్మహత్య చేసుకునే ఆలోచన రావడం తనను విస్మయానికి గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ గురుకులం లో విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతుండగా సమయానికి తోటి విద్యార్థులు రక్షించారని, లేనిచో ఆ విద్యార్థి నిండు జీవితం బలైపోయేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత పెద్ద సంఘటన బయటకు పొక్కకుండా జిల్లా అధికారులు, గురుకుల పాఠశాల సిబ్బందిపై ఒత్తిడి తీసుకురావడం ఏమిటని ప్రశ్నించారు. ప్రస్తుతం ఆ విద్యార్థి నిలోఫర్‌లో చికిత్స పొందుతున్నాడని, రెండు రోజులు ఇబ్బందులు ఎదుర్కొని స్పృహలోకి వచ్చినట్లు తెలిపారు.
ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో, ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న తరుణంలో వసతి గృహాలను పరిశీలిస్తే చాలా ఇబ్బందికరమైన మార్పులు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ సర్కారులో గురుకులలు పేద విద్యార్థులకు దేవాలయాలుగా ఉంటే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో కారాగారాలను తలపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గురుకులాల్లో విద్యార్థులకు మంచి విద్య అందించడంతో పాటు వసతులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించాలని కోరారు.