మెదక్ అర్బన్, జూలై 6: నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందించేందుకు సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బెస్ట్ అవైలబుల్ పాఠశాలలు ఎంపిక చేసి వసతితో పాటు చదువుకొనేందుకు ప్రభుత్వం సౌక ర్యం కల్పించింది. మెదక్ జిల్లాలో వంద మంది విద్యార్థులు మెదక్, తూప్రాన్‌లో ఉన్న ప్రైవేట్ పాఠశాలలో చదువుకొనేందుకు వసతి సౌకర్యం కల్పించారు. ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలకు నిధులు విడుదల చేయక ఈ విద్యా సంవత్సరం విద్యార్థులను పాఠశాలల్లో అనుమతి ఇవ్వడం లేదు.
దీంతో విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు సోమవారం మెదక్ కలెక్టర్ ఎదుట నిరసన తెలిపారు. ప్రజావాణిలో మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేశ్‌కు సమస్య వివరించారు. ప్రభుత్వం డబ్బులు చెలిస్తేనే విద్యార్థులను పాఠశాలకు అనుమతి ఇస్తామని తెలుపడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పి మోసం చేసిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. మెదక్ జిల్లా కలెక్టర్ తగు చర్యలు తీసుకొని సమస్య పరిష్కరించాలని వారు కోరారు.