చేర్యాల, డిసెంబర్ 27: చేర్యాలలోని కస్తూర్బాగాంధీ విద్యాలయంలో శుక్రవారం విద్యార్థిను లు తరగతి గదులు వదిలి విద్యాలయం ఎదుట భైఠాయించారు. కొన్ని రోజులుగా సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు కలెక్టరేట్ ఎదుట దీక్షలు కొనసాగిస్తున్నారు. దశల వారీగా దీక్షలు చేపట్టిన ఉద్యోగులు శుక్రవారం నుంచి పూర్తి స్థాయి ఆందోళనకు దిగారు.
దీంతో కేజీబీవీలో పాఠాలు బోధించేందుకు ఉపాధ్యాయులు లేకపోవడం తో విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను శుక్రవారం తీసుకువచ్చి కేజీబీవీ విద్యార్థినులకు పాఠాలు చెప్పించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ విషయం తెలిసి విద్యార్థినులు శుక్రవారం తరగతి గదులు వదిలి ఆందోళనకు దిగారు.
ఇప్పటి వరకు తమకు పాఠాలు బోధించిన టీచర్లనే నియమించాలని నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల హామీలు నెరవేర్చాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. వారి సమస్యలు పరిష్కరించి తమ చదువులు కొనసాగేలా సీఎం వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థినుల ఆందోళన తెలిసి ఎంఈవో రచ్చ కిష్ట య్య కేజీబీవీకి వచ్చి విద్యార్థినులను సముదాయించే ప్రయత్నం చేయగా, వారు ససేమిరా అన్నారు. కొన్ని గంటల పాటు విద్యార్థినుల నిరసన కొనసాగింది. కాంగ్రెస్ సర్కారు వెంటనే స్పందించకపోతే తాము సైతం ఆందోళన చేపతామని విద్యార్థినులు హెచ్చరించారు.