సిర్గాపూర్, జూన్ 13: సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలో ఈదురుగాలులతో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో పలు గ్రామాల్లో విద్యుత్తు స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. మృగశిర కార్తె మొదలుకొని తొలకరి వర్షాలు పడటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కడ్పల్, సుల్తాన్బాద్ గ్రామాల్లో ఈదురు గాలుల బీభత్సానికి కరెంటు స్థంబాలు, చెట్టు నేలకొరిగాయని గ్రామస్తులు తెలిపారు. అలాగే రేకులు షెడ్లు ఎగిరిపోయాయని తెలిపారు.
పాపన్నపేట, జూన్ 13: మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని రామతీర్థం సబ్స్టేషన్లో గురువారం పిడుగు పడింది. దీంతో పవర్ ట్రాన్స్ఫార్మర్కు పగుళ్లు వచ్చి కొంత మేర ఆ లీకేజీ జరిగింది. దీంతో సబ్స్టేషన్ పరిధిలోని మల్లంపేట, రామతీర్థం, ముద్దాపురం, నర్సింగ్రావుపల్లి తదతర గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. ఇంజినీర్లు వస్తే తప్ప ఎంత నష్టం జరిగిందో చెప్పలేమని సబ్స్టేషన్ వర్గాలు వెల్లడించాయి.
శివ్వంపేట, జూన్ 13: మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని పలు గ్రామాల్లో గురు వారం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. దీంతో లింగోజిగూడకు చెందిన దొంతి లక్ష్మయ్య పౌల్ట్రీఫాం కుప్పకూలింది. అందులోని కోళ్లు, కోడిపిల్లలు మృత్యువాత పడ్డాయి. అదేవిధంగా మండలంలోని రూప్లతండా పంచాయతీలోని పోతిరెడ్డిపల్లితండాలో బానవత్ లక్ష్మికి చెందిన రేకుల ఇల్లు ఈదురుగాలులకు ఎగిరిపోయింది. బాధితులు తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.