పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా సోమవారం బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు ప్రత్యేక బృందాలను ప్రకటించారు.. సిద్దిపేట జిల్లాకు పార్టీ జనరల్ సెక్రటరీగా బోడకుంటి వెంకటేశ్వర్లు, మెదక్ జిల్లాకు ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, సంగారెడ్డి జిల్లాకు ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డిని నియమించారు. వీరంతా ఆయా జిల్లాల్లో పార్టీని బలోపేతం చేసేలా ప్రణాళికలు తయారు చేసి ముందుకు వెళ్లనున్నారు.
– సిద్దిపేట, మార్చి 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
సిద్దిపేట, మార్చి 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. సోమవారం రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు ప్రత్యేక బృందాలు నియమించారు. సిద్దిపేట జిల్లాకు పార్టీ జనరల్ సెక్రటరీగా బోడకుంటి వెంకటేశ్వర్లు, మెదక్ జిల్లాకు ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, సంగారెడ్డి జిల్లాకు ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డిలను నియమించారు. వీరంతా ఆయా జిల్లాల్లో పార్టీ కార్యక్రమాలను స్థానిక ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కలిసి నిర్వహిస్తారు. రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపును విజయవంతం చేసేలా తగు కార్యాచరణతో ముందుకెళ్తారు.
ఈ బృందాలు క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నాయి. ప్రతి పది గ్రామాలను ఒక యూనిట్‌గా చేసుకుని ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గ్రామ, పట్టణ, మండల, జిల్లా స్థాయి వరకు పార్టీ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తారు. అంబేద్కర్ జయంతి, బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంతో పాటు ఇతర కార్యక్రమాలను విజయవంతం చేసేలా ఈ బృందాలు క్షేత్రస్థాయిలో అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తాయి. పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ ఈ నాలుగు నెలల పాటు అందరూ ప్రజల్లో ఉండేలా బీఆర్ఎస్ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. అందుకు అనుగుణంగా స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ఇతర పార్టీ నేతలు సమన్వయంతో బీఆర్ఎస్లో జోష్ పెంచనున్నారు.
సిద్దిపేట – పార్టీ జనరల్ సెక్రటరీ బోడకుంటి వెంకటేశ్వర్లు
మెదక్: ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం
సంగారెడ్డి: ఎమ్మెల్సీ వెంకట్ రాంరెడ్డి