Siddipeta | సిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 11 : సమాజంలో విద్య, స్వేచ్ఛ, సమానత్వం గురించి పోరాడిన మహోన్నత వ్యక్తి, దార్శనికుడు, సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిభా పూలే అని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. శుక్రవారం సిద్దిపేట పట్టణంలోని విపంచి కళానిలయంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాత్మా జ్యోతిభా పూలే 199వ జయంతి కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాడు విద్య విషయంలో మహిళలు ఎదుర్కొంటున్న వివక్షను రూపుమాపి ప్రతి మహిళ చదువుకోవాలనే సంకల్పంతో ఆయన తన గదినే తరగతి గదిగా మార్చి సావిత్రిభాయికి చదువు చెప్పడమే కాకుండా దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిని ఆయన ఇంటి నుండే తయారు చేశారన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో మహాత్మా జ్యోతిభా పూలే విగ్రహాలను ఏర్పాటు చేసి ఆయన సేవలను అందరికీ తెలియజేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, డీఆర్ఓ నాగరాజమ్మ, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.