సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 21: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అతిథి అధ్యాపకుల నియామకానికి రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. వారం రోజుల్లో ఆయా జిల్లాల వారీగా నియామకాలు పూర్తి కావాలని ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని 16 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 92 పోస్టులను అతిథి అధ్యాపకులతో భర్తీ చేయనున్నారు. అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలో 40 పోస్టులు భర్తీ చేయనుండగా, సిద్దిపేట జిల్లాలో 37 పోస్టులు, మెదక్ జిల్లాలో 15 పోస్టులు భర్తీ చేయనున్నారు. అభ్యర్థులను డెమో, ఇంటర్వ్యూ విధానం ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన అతిథి అధ్యాపకులు 2022-23 విద్యా సంవత్సరం చివరి పనిదినం వరకు విధుల్లో కొనసాగుతారు.
ఖాళీల భర్తీకి చర్యలు
డిగ్రీ కళాశాలలు ప్రారంభం కావడంతో ఎలాంటి జాప్యం లేకుండా ఖాళీగా ఉన్న పోస్టులను అర్హులైన అతిథి అధ్యాపకులతో భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో రెగ్యులర్, కాంట్రాక్ట్ అధ్యాపకుల తర్వాత ఖాళీ పోస్టులను అతిథి అధ్యాపకులతో భర్తీ చేస్తారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల బలోపేతంతో విద్యార్థుల ప్రవేశాలు పెరుగుతున్నాయి. దీంతో విద్యార్థుల నిష్పత్తి ప్రకారం రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ గెస్ట్ లెక్చరర్లను నియమిస్తున్నది. సంగారెడ్డి జిల్లాలో గతేడాది 44 మంది అతిథి అధ్యాపకులను నియమించారు. ఈసారి 40 పోస్టులు భర్తీ చేయనున్నారు. మొదటి సంవత్సరం విద్యార్థుల ప్రవేశాలు కాగానే, మరింత మందిని నియమించనున్నారు. సిద్దిపేట జిల్లాలోని 7 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 37 పోస్టులు, మెదక్ జిల్లాలోని 2 కళాశాలల్లో 15 పోస్టులు భర్తీ చేయనున్నారు.
నర్సాపూర్‌లోని డిగ్రీ కళాశాల
కళాశాలల వారీగా ఖాళీలు…
సిద్దిపేట జిల్లాలోని చేర్యాల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 7 పోస్టులు, దుబ్బాక కళాశాలలో 3, హుస్నాబాద్‌లో 3, సిద్దిపేట జీడీసీఏలో 14, సిద్దిపేట మహిళా కళాశాలలో 1, గజ్వేల్ జీడీసీఎంలో 4, గజ్వేల్ జీడీసీడబ్ల్యూలో 5 పోస్టుల చొప్పున భర్తీ చేయనున్నారు. సంగారెడ్డి జిల్లాలోని జోగిపేట జీడీసీలో 5 పోస్టులు, నారాయణఖేడ్‌లో 6, పటాన్చెరులో 6, సదాశివపేటలో 4, జహీరాబాద్‌లో 5, సంగారెడ్డి జీడీసీఏలో 14, సంగారెడ్డి మహిళా డిగ్రీ కళాశాలలో 3 పోస్టులు భర్తీ చేయనున్నారు. మెదక్ జిల్లాలోని నర్సాపూర్‌లో 9, మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 6 పోస్టులను భర్తీ చేయడానికి ఉత్తర్వులు వెలువడ్డాయి. తద్వారా 11వేల మంది విద్యార్థులకు మేలు జరుగనున్నది.
నియామక నిబంధనలు ఇలా..
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అతిథి అధ్యాపక నియామకాలకు సంబంధించి రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. సంబంధిత సబ్జెక్టులో పీహెచ్డీ పూర్తిచేసిన అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. పీహెచ్డీ అభ్యర్థులు లేనిపక్షంలో నెట్ లేదా స్లెట్ అర్హత కలిగిన అభ్యర్థులను నియమిస్తారు. వీరెవరూ లేని పక్షంలో సంబంధిత సబ్జెక్టులో పీజీ పూర్తిచేసిన వారికి అవకాశం కల్పిస్తారు. ఇప్పటికే బోధన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత కల్పించనున్నారు. బోధన చేసిన అనుభవం ఉన్న అభ్యర్థులు వారి బోధన అనుభవ ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. నియామక ప్రక్రియ డెమో, ఇంటర్వ్యూ ద్వారా చేపడతారు. త్రిసభ్య కమిటీ ద్వారా నియామక ప్రక్రియ కొనసాగనున్నది. త్రిసభ్య కమిటీలో సంబంధిత కళాశాల విషయ నిపుణుడు, ప్రిన్సిపాల్, జిల్లా ఐడీ కళాశాల ప్రిన్సిపాల్ ఉంటారు. ఎంపికైన అభ్యర్థులు 2022-23 విద్యా సంవత్సరంలోని చివరి పనిదినం వరకు బోధించాల్సి ఉంటుంది. కేవలం బయోమెట్రిక్, వర్క్‌డన్ ఆధారంగా వేతనం చెల్లిస్తామని, జీవో 43 ప్రకారం వేతనం చెల్లించనున్నట్టు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.