మెదక్, ఆగస్టు 25(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యాన్ని సరఫరా చేస్తున్న డీలర్లు కమీషన్ డబ్బులు అందక ప‘రేషాన్’లో ఉన్నా రు. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ డీలర్ల కమీషన్ బకాయిలు మంజూరు చేయకపోవడంతో డీలర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలను దృష్టిలో ఉంచుకొని జూన్ నుంచి ఆగస్టు వరకు ఒకేసారి మూడు నెలల కోటా ను పంపిణీ చేశారు. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఐదు నెలల కమీషన్ డబ్బులు రావా ల్సి ఉంది. పౌరసరఫరాల సంస్థ 3 నెలలుగా కమీషన్ విడుదల చేయడం లేదని తెలిసిం ది. కమీషన్‌పైనే ఆధారపడిన అనేక రేషన్ డీలర్ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదురొంటున్నాయి. మెదక్ జిల్లాలో 521 రేషన్ షాపులు ఉన్నాయి. ఆహార భద్రత కార్డులు 2,18,614 ఉన్నాయి. అంత్యోదయ 13,900, అన్నపూర్ణ 65 కార్డులు ఉన్నాయి. నెలవారీ కోటా 4,850,008 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని 7 ఎంఎల్ఎస్ పాయింట్లు నుంచి సరఫరా చేస్తారు.
రేషన్ బియ్యం పంపిణీ చేసినందుకు డీలర్లకు ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.140 చొప్పున కమీషన్ చెల్లిస్తున్నది. మెదక్ జిల్లాలో 521 మంది రేషన్ డీలర్లు ఉన్నారు. వీరంతా ప్రతినెలా 4,850,008 టన్నుల బియ్యం పేదలకు పంపిణీ చేస్తారు. ఇందుకు వీరికి ప్రతినెలా కమీషన్ రూపంలో సుమారు రూ. 20వేల నుంచి రూ.60 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఐదు నెలలుగా కమీషన్ చెల్లింపుల్లో పౌరసరఫరాల సంస్థ జాప్యం చేస్తున్నట్టు తెలిసింది.
దీంతో రేషన్ డీలర్లకు చెల్లించాల్సిన కమీషన్ బకాయిలు రూ.2 కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం. కమీషన్ విడుదలలో జాప్యానికి పౌరసరఫరాల సంస్థలోని పలువురు అధికారుల తీరే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో రేషన్ డీలర్లపై కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీల వర్షం కురిపించింది. ఎన్నికల మ్యానిఫెస్టోలో రేషన్ డీలర్ల కమీషన్‌ను రూ.300కు పెంచుతామని హామీ ఇచ్చింది. దీంతో పాటు ప్రతి నెలా రూ.5వేల గౌరవ వేతనం ఇస్తామంటూ ఆశ పెట్టింది. తీరా అధికారంలోకి వచ్చిన మొండిచేయి చూపింది. సోమవారం జిల్లా వ్యాప్తంగా అన్ని తహసీల్కార్యాలయాల్లో తహసీల్దార్లకు వినతి పత్రాలు అందజేశారు.