ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,615 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో 499 జీపీలు, మెదక్ జిల్లాలో 469 జీపీలు, సంగారెడ్డి జిల్లాలో 647 జీపీలు ఉన్నాయి.1 ఫిబ్రవరి 2024తో పంచాయతీల పాలక వర్గాల పదవీ కాలం ముగిసింది. దీంతో ఆరోజు నుంచి గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతున్నది.
సిద్దిపేట, ఆగస్టు 21(నమస్తే తెలంగాణ ప్రతినిధి): పల్లెల అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. 19 నెలలుగా పల్లెలకు రూపాయి నిధులు విడుదల చేయకపోవడంతో అభివృద్ధి కుంటుపడింది. సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. వర్షాలకు అంతర్గత వీధులు చెరువులను తలపిస్తున్నాయి. వీధులన్నీ చిత్తడి చిత్తడిగా మారాయి. గ్రామాలను పట్టించుకున్న వారు కరువయ్యారు.వానకాలం కావడంతో పారిశుధ్యం పడగ విప్పుతున్నది. దోమలు విజృంభిస్తున్నాయి.
గ్రామీణులు జ్వరాలు బారిన పడుతున్నారు. ప్రత్యేకాధికారుల పాలన పంచాయతీ కార్యదర్శులపైనే భారం మోపడంతో వారు అప్పులు తెచ్చి చేతనైన కాడికి పనులు చేస్తున్నారు. జీపీలకు నిధులు రాకపోవడంతో తాము ఏమిచేయలేమని పంచాయతీ కార్యదర్శులు చేతులెత్తేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం జీపీలకు ఇప్పటి వరకు రూపాయి నిధులు విడుదల చేయలేదు. పంచాయతీ కార్మికులకు నెలల తరబడి వేతనాలు పెండింగ్లోనే ఉన్నాయి. పల్లెలకు నిధుల విడుదల చేయడంపై, గ్రామాల అభివృద్ధి, పారిశుధ్య కార్మికుల వేతనాలు చెల్లంచడం, కార్యదర్శులు కష్టాలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
గ్రామాల్లో పారిశుధ్యం పడకేయడంతో రోజురోజుకు ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. డెంగీ, టైఫాయిడ్, మలేరియా జ్వరాలు, ఒళ్లు నొప్పులు తదితర వాటితో ఇబ్బంది పడుతున్నారు. గడ్డి విపరీతంగా పెరగడంతో పాటు పారిశుధ్యం లోపించి పల్లెలు అధ్వానంగా మారాయి. ఇంటింటా చెత్త సేకరణ సరిగ్గా జరగడం లేదు. బీఆర్ఎస్ హయాంలో వర్షాకాలం రాగానే పల్లెప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించి, అందుకు తగ్గట్టుగా నిధులు విడుదల చేసి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచింది.
దీంతో అప్పట్లో ఇంతగా విషజ్వరాలు, సీజనల్ వ్యాధులు ప్రబలలేదు. తక్కువ సంఖ్యలో మాత్రమే కేసులు నమోదయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాలను విస్మరించడంతో గ్రామాలు, తండాలు మంచం పడుతున్నాయి. దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. డెంగీ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఇటీవల డెంగీ బారినపడి ఉమ్మడి మెదక్ జిల్లాలో పలువురు చనిపోయారు.తాగునీటి సరఫరా పైప్లైన్ లీకేజీలు, వాటర్ ట్యాంకులు అపరిశుభ్రంగా ఉండడంతో నీటి కలుషితం జరుగుతున్నది. జీపీలకు నిధులు రాక ఈ పనులన్నీ పంచాయతీ సిబ్బంది చేయించలేక పోతున్నారు.దీంతో ప్రజలపై ప్రభావం చూపుతున్నది.
ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేయాలంటే పంచాయతీ కార్యదర్శులకు భారంగా మారింది. గ్రామ పంచాయతీల్లో రూపాయి నిధులు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే చిన్న చిన్న అవసరాలకు తోడుగా గ్రామాల్లో ప్రధానంగా బోరు మోటర్లు, వీధిలైట్లు, పారిశుధ్య పనులకు జేబులో నుంచి ఖర్చుపెట్టామని, ప్రభుత్వం నుంచి బిల్లులు రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.జీపీ చెత్త సేకరణ ట్రాక్టర్లు మూలకు పడ్డాయి. డంపుయార్డులు, వైకుంఠ ధామాల నిర్వహణ అధ్వానంగా మారింది. వెరసి కాంగ్రెస్ పాలనలో గ్రామసీమలు కళతప్పాయి.