చేర్యాల, అక్టోబర్ 13 : మార్పు పేరుతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మల్లన్న ఆలయంపై వివక్ష చూపుతున్నది.వేలాది ఉద్యోగాలు ఇచ్చామని ప్రకటించుకుంటున్న సీఎం రేవంత్‌రెడ్డి సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న ఆలయంలో సరిపడా సిబ్బందిని నియమించడంలో విఫలమయ్యారని భక్తులు ఆరోపిస్తున్నారు.రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో సిబ్బంది కొరత ఏర్పడింది. డిప్యూటీ కమిషనర్ స్థాయి దేవాలయంలో ఉండాల్సిన సిబ్బందిలో కనీసం మూడో వంతు కూడా లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకైన కొమురవెల్లి మల్లన్న ఆలయంలో ప్రతి ఏటా మూడు మసాల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి భారీగా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు.రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలకు భిన్నంగా కొమురవెల్లి మల్లన్న ఆలయంలో మూడు మాసాలు పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.ఇందులో స్వామి వారి కల్యాణం, పట్నం వారం, పట్నం నుంచి వచ్చిన భక్తులు పట్నం వారం సందర్భంగా మల్లన్న క్షేత్రంలో పెద్దపట్నం, అగ్నిగుండాలు నిర్వహించుకునే కార్యక్రమంతో పాటు మహాశివరాత్రికి పెద్దపట్నం, ఉగాది ముందు వచ్చే ఆదివారం అగ్నిగుండాల కార్యక్రమాలకు భారీగా భక్తులు తరలివస్తారు.
మిగిలిన రోజుల్లో ఆది,బుధవారంలో వేల సంఖ్యలో భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకుం టారు.భక్తులు వచ్చే సంఖ్యకు అనుగుణంగా మల్లన్న ఆలయంలో సిబ్బంది లేకపోవడంతో ఆలయ అధికారులతో పాటు పని చేస్తున్న అర్చకులు, ఒగ్గు పూజారులు భక్తులకు సేవలందించేందుకు ఇబ్బందులు తప్పడం లేదు
మల్లన్న ఆలయంలో అధికారులు, సిబ్బంది లేకపోవడంతో భక్తులకు సేవలు అందడం లేదు.డిప్యూటీ కమిషనర్ స్థాయి దేవాలయంలో డిప్యూటీ కమిషనర్‌తో పాటు ఇద్దరు ఏఈవోలు ఉండాల్సి ఉండగా ఒక్క ఏఈవో మాత్రమే విధుల్లో ఉండగా మరో ఏఈవో సస్పెన్షన్ కావడంతో రెండేండ్లుగా విధులు నిర్వహించకపోగా సదరు ఉద్యోగికి నెలనెలా రూ.90వేల వేతనం సైతం చెల్లిస్తున్నారు.ఇద్దరు సూపరింటెండెంట్లకు ఒక పర్యవేక్షకుడు ఇటీవల డిప్యూటేషన్‌పై యాదాద్రి ఆలయానికి వెళ్లగా మరోకరు ఈ నెలఖారులో ఉద్యోగ విమరణ పొందనున్నారు. నలుగురు సీనియర్ అసిస్టెంట్లకు ఒక్కరు మాత్రమే ఉన్నారు. పదిమంది జూనియర్ అసిస్టెంట్లు ఉండాల్సి ఉండగా 8 మంది ఉన్నారు.
నలుగురు రికార్డు అసిస్టెంట్లకు ఒక్కరు కూడా లేరు.10 మంది అటెండర్లకు కేవలం ఒక్కరు మాత్రమే ఉన్నారు.ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు ఉండాల్సి ఉండగా ఒక్కరిని కూడా దేవాదాయశాఖ నియమించలేదు. ఔట్ సోర్సింగ్ సిబ్బందితో కంప్యూటర్ పనులు చేయిస్తున్నారు. తాజాగా ఆలయ డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న టంకశాల వెంకటేశ్ సైతం మరో నాలుగు నెలల్లో ఉద్యోగ విరమణ పొందనున్నారు. దేవాదాయశాఖ ఉన్నతాధికారులు స్పందించి త్వరలో జరగనున్న కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాల సమయానికి సరిపడా సిబ్బందిని నియమించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.