నారాయణరావుపేట, జూన్ 12: ఆయిల్‌పామ్ సాగుతో రైతులు స్థిర ఆదాయం పొందవచ్చని, అంతర పంటలు సాగుచేసి అదనపు ఆదాయం ఆర్జించవచ్చని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలంలోని గోపూలాపూర్లో మాజీ ఎంపీపీ బాలకృష్ణ ఆయిల్‌పామ్ తోటలో గెలల తొలి కోతను హరీశ్‌రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పనికి సత్ఫలితం వచ్చినప్పుడే నిజమైన సంతృప్తి, సార్థకత ఉంటుందన్నారు. సిద్దిపేట రైతుల్లో నమ్మకం, స్థిరమైన ఆదాయం కోసం ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. కండ్ల ముందు రైతులు ఫలితాలు అనుభవిస్తుంటే, ఓవైపు సంతోషం కలుగుతుందని, మరోవైపు తన కల నిజమైందని అన్నారు. ఆయిల్‌పామ్ డోకా లేని పంట అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని నర్మెటలో రూ.350 కోట్లతో నిర్మించినట్లు తెలిపారు.
ఆయిల్‌పామ్ పంటకు రాళ్లవాన వరమని, చీడ పీడల బాధ ఉండదన్నారు. అశ్వరావుపేటలో రైతుల తరహాలో సిద్దిపేట రైతులు అభివృద్ధి చెందాలని తన కోరిక అన్నారు. ఈ పంటకు చాలా సబ్సిడీలో ఉన్నాయని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఒక్కసారి ఆయిల్‌పామ్ మొక్కలు నాటితే 30 ఏండ్ల వరకు పంట ఉంటుందని, రాను రాను ఆదాయం మరింత పెరుగుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రిఫైనరీలకు కొమ్ము కాస్తుందని ఆరోపించారు. కేంద్రం ఏడాదిలో రూ. లక్ష కోట్ల నూనె గింజలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిపారు.
దీంతో విదేశీ మారకద్రవ్యం మనం కోల్పోతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించడం లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో సాగును ప్రోత్సహించినట్లు తెలిపారు. వరిపంట వేస్తే రెండు పంటలకు రూ.50 వేల ఆదాయం వస్తే, ఆయిల్‌పామ్ సాగుతో లక్షా యాభై వేలు ఆదాయం వస్తుందన్నారు. పదువులు ఉంటాయి.. పోతాయి.. కానీ, రైతులకు సేవ చేయడంలో నిజమైన సంతృప్తి ఉంటుందన్నారు. యువత ఆన్లైన్ గేమ్స్ ఆడి జీవితాలు నాశనం చేసుకోవద్దని, గంజాయి లాంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని హరీశ్‌రావు సూచించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.