గజ్వేల్, మే 5: అధికారంలోకి వస్తే పేదలకు ఇందిరమ్మ ఇం డ్లు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడేమో 60గజాలలోపే నిర్మాణం చేసుకోవాలని కొర్రీ లు పెట్టడం దారుణమని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టి ఉత్తర ప్రగల్భాలు పలికిన నేతలు ఇప్పుడు మాటమార్చి ప్రజలను మరోసారి మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ కార్యకర్తలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమేనా.. పేదలకు ఇవ్వరా అని ప్రశ్నించారు. ధనవంతులైన కాంగ్రెస్ కార్యకర్తలకు ఇవ్వడం దారుణమన్నారు. అర్హులను కాదని కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే ఊరుకునేది లేదని, పేదలతో కలిసి కాంగ్రెస్ కార్యకర్తలకు బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అకాల వర్షాలతో ధాన్యం తడిస్తే ప్రభుత్వానికి చీమకుట్టినట్లు లేదని, రైతులు పండించిన పంటను కొనుగోలు చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉండడం సిగ్గుచేటన్నారు.
మూడు నెలలుగా రైతుబీమా ప్రీమియం చెల్లించకపోవడంతో అనేక కారణాలతో మృతి చెందిన రైతులకు పరిహారం అందించడం లేదన్నారు.తులం బంగారం ఇవ్వడంలో కాంగ్రెస్ విఫలమైందని, ఇచ్చిన హామీలను విస్మరించిందన్నారు. ముఖ్యమంత్రి నుంచి మొదలుకుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, నియోజకవర్గ ఇన్చార్జిలు ఎక్కడికక్కడ అవినీతికి పాల్పడుతూ అక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు.