మూసీ పునరుజ్జీవం పేరిట బాధితులకు పరిహారం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిహాసమాడుతున్నది. మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ నివాసితులను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ నేతలతో పాటు అధికారులు తలో మాట మాట్లాడుతూ అయోమయానికి గురిచేస్తున్నారు. ఏండ్ల తరబడిగా పైసాపైసా కూడబెట్టుకుని ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తీసుకుని కట్టుకున్న ఇండ్లను అక్రమంగా నిర్మించారంటూ..బిల్డర్లపై నెపం నెడుతున్నారు. నోటిఫికేషన్లోనేమో పరిహారంగా టీడీఆర్ ఇస్తామని పేర్కొని ప్రభుత్వ ప్రతినిధుల్లో కొందరు ఫ్లాట్‌కు ఫ్లాట్ ఇస్తామని చెబుతూ మీడియాకు లీకులు ఇస్తున్నారు.
మరికొందరు ఎస్ఎఫ్టీకి రూ.5 వేలు ఇస్తామంటున్నారు. గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్లను కొనుగోలు చేసి ఇస్తామని, అందుకు తగ్గట్లు నిర్మాణాలను వెతుకుతున్నామని సోషల్‌మీడియాలో లీకులు ఇస్తున్నారు. ఇలా అధికార పార్టీ నేతలు రోజుకో స్టేట్మెంట్ ఇస్తూ మధు పార్క్ నివాసితులను అయోమయంలో పడేస్తున్నారు. 2004లో కట్టుకున్న ఇండ్లకు నిబంధనల ప్రకారం నాడు నిర్ణయించిన హద్దులను కాదని మారిన నిబంధనల ప్రకారం అపార్ట్మెంట్ బఫర్‌జోన్‌లో ఉందంటూ అధికారులే ప్రకటిస్తున్నారు. గ్రామ సభ ద్వారా అభిప్రాయాలు తీసుకుంటామని ప్రకటించి.. నిర్ణయాన్ని విరమించుకున్నారు. ఇలా పూటకో మాటలు మాట్లాడుతూ ఇచ్చినంత పరిహారం తీసుకునేలా భయాందోళనలకు గురిచేస్తున్నారు.
– సిటీ బ్యూరో, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ)
మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ ఆరెకరాల విస్తీర్ణంలో పక్కా పట్టా భూమిలో 2004లో నిర్మించారు. అక్కడ అపార్ట్మెంట్ నిర్మించిన సమయంలో మూసీ బఫర్‌జోన్‌ను నదీ నుంచి 9 మీటర్లుగా నిర్ణయించారు. నోటిఫికేషన్లో పేర్కొన్నట్లు బఫర్‌జోన్‌కు బయట ఉన్న నిర్మాణానికి టీడీఆర్ 400 శాతం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ తాజాగా ఆర్డీవో మీడియా సమావేశంలో ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం 50 మీటర్ల లోపు దూరంలో ఉన్నందున బఫర్ జోన్లో ఉందని పేర్కొన్నారు. ఆయన చెప్పినదాని ప్రకారం పరిహారం కింద టీడీఆర్ ఇస్తే 300 శాతానికే పరిమితమవుతుంది.
కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ ఏకంగా అపార్ట్‌మెంట్‌ను బిల్డర్లు అక్రమంగా నిర్మించారని ప్రకటించారు. ఆ అపార్ట్మెంట్ నిర్మాణం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జరిగింది. అక్రమ నిర్మాణమే అయితే అప్పటి ప్రభుత్వం ఎలా అనుమతించిందని అపార్ట్మెంట్ వాసులు ప్రశ్నిస్తున్నారు. అక్రమ నిర్మాణమని చెప్పడం ద్వారా వారిని భయబ్రాంతులకు గురిచేసి పరిహారం ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
తాజాగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి సామల రామ్మోహన్‌రెడ్డి ఒక ఎస్ఎఫ్టీకి రూ.5 వేలు చెల్లిస్తామని చెబుతున్నారు. ప్రస్తుతం అక్కడ ఒక్క ఎస్ఎఫ్టీకి రూ.2,200 ధర ఉన్నది. నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా నాలుగింతలుగా ఒక్కో ఎస్ఎఫ్టీకి రూ.8,800 చొప్పున పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. కానీ కాంగ్రెస్ నేతలు దిశానిర్దేశం లేకుండా అవగాహన రాహిత్యంతో ఇష్టానుసారం మాట్లాడుతూ బాధితులను వేధింపులకు గురిచేస్తున్నారు.
పట్టా భూమిలో ప్రభుత్వ అనుమతితో నిర్మించుకున్న మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్‌ను స్వాధీనం చేసుకుంటామని నోటిఫికేషన్ ఇచ్చిన నాటి నుంచి వారు వివిధ రూపాల్లో ప్రభుత్వంపై నిరసన తెలుపుతున్నారు. కాంగ్రెస్ సర్కారు, సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ సైతం వారికి అండగా ఉంటామంటూ భరోసా కల్పించింది. దీంతో మధు పార్క్ అపార్ట్మెంట్ అంశం తీవ్ర వివాదస్పదం కావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నాటకానికి తెర తీసింది. అపార్ట్మెంట్ వాసులకు ఫ్లాట్‌కు ఫ్లాట్ ఇస్తామంటూ లీకులిచ్చింది.
సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తున్నది. చుట్టుపక్కల ఉన్న గేటెడ్ కమ్యూనిటీలను పరిశీలిస్తున్నామని ఫ్లాట్‌కు ఫ్లాట్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టులు పెడుతున్నారు. ఇదంతా మధు పార్క్ అపార్ట్‌మెంట్‌వాసులు ఆందోళనలు చేపట్టకుండా ఆపేందుకు ఆడుతున్న డ్రామాగా తెలుస్తున్నది. అసలు ఫ్లాట్‌కు ఫ్లాట్ ఇవ్వడం ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ పునరుజ్జీవం పేరిట ఇండ్లను కూల్చిన ప్రతిచోటా ఫ్లాట్‌కు ఫ్లాట్ ఇవ్వాల్సి ఉంటుంది.
ప్రజలు భూములను స్వాధీనం చేసుకున్న ప్రతి చోటా భూమికి భూమి ఇవ్వాలి. ఇది ఎలా సాధ్యమవుతుంది? మూసీ పొడవునా ఇదే తరహా విధానాన్ని అనుసరించాల్సి ఉంటుంది. వేరే ప్రాంతంలో భూసేకరణ చేపట్టినా ఫ్లాట్‌కు ఫ్లాటు, భూమికి భూమి ఇవ్వడం ఎలా కుదురుతుంది? కాంగ్రెస్ నేతలు బాధితులును మభ్యపెట్టి అయోమాయానికి గురిచేయడానికే ఫ్లాట్‌కు ఫ్లాటు అనే నాటకం ఆడుతున్నట్లు స్పష్టమవుతున్నది. బాధితులకు ఇవ్వాల్సిన పరిహారం విషయంలోనూ ఇష్టానుసారం మాట్లాడటంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.