అమీన్పూర్, డిసెంబర్ 23: ఐలాపూర్ భూ అక్రమాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉందని, ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని సంగారెడ్డి ఆర్డీవో రవీందర్‌రెడ్డి అన్నారు. ఐలాపూర్‌లోని వివాదాస్పద భూముల్లో కొనసాగుతున్న ఆక్రమణలపై శనివారం ఆయన స్థానిక తహసీల్దార్ గౌరీవత్సలతో కలిసి ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న భూ ఆక్రమణదారులు అధికారులను అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. కోర్టు ఆదేశాలను గౌరవించాల్సిందేనని, నిబంధనలకు విరుద్ధంగా ఏ ఒక్కరూ ప్రయత్నించినా క్రిమినల్ కేసులు పెట్టాలని ఆర్డీవో స్థానిక అధికారులను ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఐలాపూర్ భూ ఆక్రమణలపై నిగ్గు తేలుస్తామని, ఇకపై ఒక్క గజం కబ్జాకు గురైనా చూస్తూ ఊరుకోబోమన్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రత్యేక కమిటీ వేసి ఏర్పాటు చేయనున్నామన్నారు. అధికారులు సైతం సమన్వయం పనిచేయాలని సూచించారు. అమీన్పూర్లో విలువైన ప్రభుత్వ భూములు ఉన్నాయని, వాటిని పరిరక్షించేందుకు జిల్లా సర్వే అధికారులు వారానికి రెండు రోజులు స్థానికంగా అందుబాటులో ఉంటారని, స్థానిక అధికారులతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారని తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు సైతం ఐలాపూర్ శివారు ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని కోర్టు ఆదేశానుసారం పనిచేయాలన్నారు. వివాదాస్పద భూములు, ప్రభుత్వ భూముల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలకు సమాచారం అందేలా చూడాలని ఆదేశించారు. ఆయనవెంట డిప్యూటీ సర్వేయర్ బాలరాజ్, ఆర్ఐ రఘునాథ్‌రెడ్డి, స్థానిక పంచాయతీ కార్యదర్శులు సచిన్, బిందు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.
బొల్లారం, డిసెంబర్ 23: నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా చేపట్టిన అక్రమ నిర్మాణాలను శనివారం రాత్రి హుడా అధికారులు కూల్చివేశారు. బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని బీసీ కాలనీలో ఎలాంటి అనుమతులు లేకుండా హుడా భూముల్లో అక్రమ నిర్మాణాలపై స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారులు జేసీబీ సహాయంతో నిర్మాణాలను నెలమట్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.