సంగారెడ్డి, జూన్ 16: జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చే ప్రతి ఫిర్యాదు దారుడి కేసును పరిశీలించి చట్టప్రకారం పరిష్కరించేందుకు సంబంధిత పోలీసుఅధికారులు చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి తరలివచ్చిన ఫిర్యాదుదారుల నుంచి ఆయన అర్జీలు స్వీకరించి సంబంధిత ఎస్‌హెచ్‌వోలకు ఫోన్లో మాట్లాడి న్యాయం చేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి జిల్లా కార్యాలయానికి తమ గోడు వివరించి న్యాయం పొందేందుకు వచ్చారని, సంబంధిత స్టేషన్లో తగిన న్యాయం జరగకనే జిల్లా కార్యాలయానికి వస్తున్నారన్నారు. ఇలాంటి ప్రక్రియ పునరావృతం కాకుండా ఎస్‌హెచ్‌వోలు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. చట్టప్రకారం సమస్యలు పరిష్కరించేందుకు పోలీసుశాఖ ప్రజలకు మరింత దగ్గరయ్యేలా ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని ఎస్పీ వెల్లడించారు.