కవాడిగూడ, మార్చి 17: గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, వేతనాలకు బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ గ్రామపంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన చలో అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. మంగళవారం గ్రామపంచాయతీ కార్మికుల ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు నగరానికి చేరుకున్నారు. అశోక్‌నగర్ నుంచి అసెంబ్లీ వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
పోలీసుల తీరును నిరసిస్తూ కార్మికులు, సీఐటీయూ నాయకులు ఇందిరాపార్కు వద్ద బైఠాయించగా, వారిని అరెస్టు చేసి పలు పోలీస్స్టేషన్లకు తరలించారు. అనంతరం సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ.. పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు గ్రీన్‌చానల్ ద్వారా వేతనాలతోపాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. 9నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులపై నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 18,19న సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టాలని పిలుపునిచ్చారు.