కవాడిగూడ, మార్చి 17: రాష్ట్రంలోని చేతివృత్తిదారుల సంక్షేమం కోసం బడ్జెట్లో రూ.25 వేల కోట్లు కేటాయించాలని వక్తలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్కు వద్ద వృత్తిదారుల మహాధర్నా జరిగింది. కల్లుగీత, విశ్వబ్రాహ్మణ, గంగపుత్ర, వడ్డెర, మేదరి, రజక, నాయీబ్రాహ్మణ, ఇతర సంచార జాతులకు చెందిన చేతివృత్తిదారుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలమైందని విమర్శించారు. బీసీ సబ్‌ప్లాన్ చట్టం ద్వారా ఆ నిధులను ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. ఎంవీ రమణ, పోతినేని సుదర్శన్‌రావు, గోరెంకల నర్సింహ, కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ, పైళ్ల ఆశయ్య, అయిలి వెంకన్నగౌడ్ మాట్లాడుతూ చేతివృత్తిదారుల సంక్షేమానికి నిధులు కేటాయించాలని కోరారు.