సంగారెడ్డి జిల్లా న్యూస్ నెట్వర్క్, ఫిబ్రవరి 1 : తెలంగాణ జాతిపిత కేసీఆర్కు అక్రమ పద్ధతుల్లో నోటీసులిచ్చి విచారణకు పిలవడంపై యావత్ బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, ఉద్యమకారులు, అభిమానులు, సామాన్యజనం సైతం భగ్గుమంటున్నారు. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఆదివారం పల్లెపల్లెన ఎక్కడా చేసినా సీఎం దిష్టిబొమ్మలను పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులపై కక్ష సాధిస్తుందని, జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ మండిపడ్డారు.

సంగారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి కొత్త బస్టాండ్ వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి, నల్ల కండువాలతో సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మతో ర్యాలీ నిర్వహించి ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. జహీరాబాద్ పట్టణంలో ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు అధ్వర్యంలో ప్రధాన వీధుల గుండా నల్ల కండువాలతో నిరసన ర్యాలీని నిర్వహించారు.

ఇస్నాపూర్ చౌరస్తాలో ఎస్సీ,ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. పటాన్ చెరు ఇన్చార్జి ఆదర్శరెడ్డి ఆర్సీపురంలోని జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. కక్షసాధింపు రాజకీయాలకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డా యని హెచ్చరించారు.



