సంగారెడ్డి కలెక్టరేట్, జనవరి 5: సింగూరు డ్యామ్ మరమ్మతుల నేపథ్యంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలుగకుండా ముం దస్తు చర్యలు చేపట్టాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టరేట్ చాంబర్లో సోమవారం జిల్లా నీటి పారుదల, మిషన్ భగీరథ, హెచ్ఎండబ్ల్యూఎస్ శాఖల అధికారులతో ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సింగూరు డ్యామ్‌లో 517.5 లెవెల్ వరకు నీటిని ఖాళీ చేయనున్నట్లు తెలిపారు. తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, తాగునీటిపై ప్రభావం చూపే గ్రామాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, సింగూరు కింద ఉన్న ఆయకట్టు ప్రాంతాలు, ఆయా ప్రాంతాల రైతులకు ముందస్తు సమాచారం అందించే అంశాలపై అధికారులతో చర్చించారు.
నీటి పారుదలశాఖ ఎస్ఈ రఘునాథరావు మాట్లాడారు. సింగూర్ జలాశయం నుంచి 517.5 లెవెల్ వరకు దాదాపు 40 రోజుల పాటు దశలవారీగా పవర్ హౌజ్ ద్వారా నీటిని విడుదల చేయనున్నట్లు కలెక్టర్‌కు వివరించారు. అప్పటికీ జలాశయంలో 8.17 టీఏంసీల నీటి నిల్వ మిగులుతుందన్నారు. అందు లో దాదాపు 8 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకు వినియోగించవచ్చన్నారు. సమావేశంలో డీఆర్వో పాండు, మిషన్ భగీరథ ఎస్ఈ రఘువీర్, వివిధ నీటి పారుదలశాఖల అధికారులు పాల్గొన్నారు.
నిమ్జ్, రెవెన్యూ, టీజీఐఐసీ అధికారులతో భూసేకరణపై కలెక్టర్ ప్రావీణ్య సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల అభివృద్ధికి భూసేకరణ అత్యంత కీలకమని స్పష్టం చేశారు. భూములు ఇచ్చిన రైతులకు చెల్లించాల్సిన పరిహారం, అవార్డుల్లో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. టీజీఐసీసీ ప్రాజెక్టులకు మొత్తం 12,635 ఎకరాల భూమి అవసరం కాగా, ఇప్పటి వరకు 6,500 ఎకరాల భూసేకరణ పూర్తయినట్లు వివరించారు.
పెండింగ్‌లో ఉన్న భూ సేకరణ ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. నిమ్జ్ ఫేజ్-1 పరిధిలో మిగిలి ఉన్న భూముల స్వాధీనానికి వేగవంతం చేసి, నేషనల్ ఇండస్ట్ట్రియల్ కారిడార్ డెవలాప్మెంట్ కార్పొరేషన్‌కు వెంటనే అప్పగించాలని సూచించారు. నిమ్జ్ ఫేజ్-1లో బర్దిపూర్, ఎల్గోయి గ్రామాల రైతులకు తక్షణ ప్రయోజనం కలిగేలా చూడాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి, నిమ్జ్ ప్రత్యేకాధికారి విశాలాక్షి, టీజేఐఐసీ జోనల్ మేనేజర్ రతన్‌రాథోడ్, సంగారెడ్డి, జహీరాబాద్ ఆర్డీవోలు రాజేందర్, దేవుజా,సంబంధితశాఖల అధికారులు పాల్గొన్నారు.