మద్దూరు (ధూళిమిట్ట), మే 02 : మద్దూరు మండలంలోని నర్సాయపల్లిలో ఏప్రిల్ 29న ప్రారంభమైన దేవతామూర్తుల ప్రతిష్ఠాపనోత్సవాలు ముగిశాయి. శనివారం నూతనంగా ప్రతిష్టించిన దుర్గమ్మకు గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం డప్పు చప్పుళ్లతో, శివసత్తుల పూనకాల మధ్య మహిళలు బోనాలు తీశారు.
భారీగా తరలివచ్చిన మహిళలు బోనాలు నెత్తిన పెట్టుకొని ఊరేగింపుగా ఆలయం వరకు వెళ్లారు. అనంతరం దుర్గమ్మకు బోనాలను నైవేద్యంగా సమర్పించారు. రాత్రి దుబ్బు కళాకారుల ఆధ్వర్యంలో దుర్గమ్మ కథ తదితర కార్యక్రమాలను నిర్వహించారు. దుర్గమ్మ పండుగ కోసం వివిధ ప్రాంతాల నుంచి జనం పెద్ద సంఖ్యలో రావడంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది.