గజ్వేల్, మార్చి 10: సిద్దిపేట జిల్లా గజ్వేల్ (Gajwel) మండలం రిమ్మనగూడలో మహిళ దారుణ హత్యకు గురైంది. సోమవారం తెల్లవారుజామున రిమ్మనగూడ సమీపంలోని పెట్రోల్ పంపువద్ద ఈ ఘటన చోటుచేసుకున్నది. హైదరాబాద్కు చెందిన సాదక్ తన భార్య ఆస్రాతో కలిసి గత కొంతకాలంగా పెట్రోల్ పంపు వద్ద సెక్యూరిటీ సిబ్బందిగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ఆదివారం ఉదయం హైదరాబాద్ వెళ్లిన ఆస్రా.. రాత్రికి మరో వ్యక్తితో కలిసి రిమ్మనగూడ వచ్చింది. రాత్రి పొద్దుపోయిన తర్వాత వారిద్దరు గొడవపడ్డారని, దీంతో అతడు పారతో ఆస్రా ముఖంపై కొట్టడంతో తీవ్రంగా గాయపడిందని, అక్కడికక్కడే మృతి చెందిందని సాదక్ తెలిపాడు. ఆమె మరణించడంతో అతడు అక్కడి నుంచి పారిపోయని వెల్లడించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. సాదక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.