మద్దూరు(ధూళిమిట్ట), మార్చి07: అక్రమంగా ఇసుక తరలిస్తే కఠినమైన కేసులు నమోదు చేయనున్నట్లు చేర్యాల సీఐ ఎల్. శ్రీను హెచ్చరించారు. శుక్రవారం ధూళిమిట్ట మండలంలోని జాలపల్లిలో పోలీసుల కళాకారుల ఆధ్వర్యంలో సామాజిక రుగ్మతలపై కళాజాతను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. జాలపల్లి వాగు నుంచి ఇసుకను తరలించకుండా ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలిపారు. సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. యువత చెడు వ్యసనాల బారిన పడి బంగారు భవిష్యత్‌ను పాడు చేసుకోవద్దన్నారు. మంత్రాలు, తంత్రాలు అనేవి లేవని, మూఢనమ్మకాలను ప్రజలు నమ్మకూడదన్నారు. అంతకుముందు కళాకారులు సామాజిక రుగ్మతలపై తమ కళారూపాలతో గ్రామస్తులను అలరించారు. కార్యక్రమంలో మద్దూరు ఎస్సై షేక్ మహబూబ్, మాజీ సర్పంచ్ చొప్పరి వరలక్షీసాగర్, పోలీస్ కళాబృందం సభ్యులు బాలు, రాజు, తిరుమల, తెలంగాణ సాంస్కృతిక సారథి బృందం సభ్యులు శ్యాంసుందర్, ప్రసాద్, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.