సిద్దిపేట, మే 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘అయ్యా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మా సిద్దిపేట వెటర్నరీ కళాశాలను రద్దు చేసి, దాని నిర్మాణ పనులను పిల్లర్ల స్థాయిలోనే ఆపి..మీ కొడంగల్ నియోజకవర్గానికి తరలించుకుపోయావు. కళాశాలకు కేటాయించిన రూ.100 కోట్లు రద్దు చేయడంతో ఎంతోమంది విద్యార్థుల ఆశలను నీరుగార్చావు. మా జిల్లా రహదారులకు కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన రూ.150 కోట్లు నిధులను రద్దు చేయడంతో ఆ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి.
ఎండీఆర్ ప్లాన్ కింద జిల్లాలో పలు రోడ్లు, బ్రిడ్జి నిర్మాణాలకు కేటాయించిన నిధులను రద్దు చేస్తూ 305 జీవోను ఫిబ్రవరి 24న విడుదల చేసింది నిజం కాదా…? సిద్దిపేట నుంచి ఇల్లంతకుంట రహదారికి మంజూరు చేసిన నిధులను రద్దు చేసి ఇతర జిల్లాలకు ఆ నిధులను మళ్లిలించిన విషయం నిజం కాదా..? రంగనాయక సాగర్ టూరిజం కోసం మంజూరు చేసిన నిధులపై కక్షకట్టావు. దీనికి నిధుల కొరత ఏర్పడింది. సిద్దిపేట కోమటిచెరువు శిల్పారామం పనులు మధ్యలోనే ఆగిపోయాయి.
ఇక పరిపాలన సౌల భ్యం కోసం నూతన జిల్లాలను కేసీఆర్ ఏర్పాటు చేస్తే …మీరు సిద్దిపేట జిల్లాను రద్దుచేసే కుట్ర చేస్తున్నారు. ఎన్నో ఏండ్లుగా ఇక్కడి ప్రజల చిరకాల వాంఛ సిద్దిపేట జిల్లా…దీనిని రద్దు చేయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది. సిద్దిపేట అభివృద్ధిపై మీకు ఎందుకు ఇంతకక్ష..ఎందుకు ఈ వివక్ష. ఇవన్నీ చేసి ఇవ్వాళ సిద్దిపేట పట్టణానికి ఎలా ఓట్లు అడగడానికి వస్తున్నారో సమాధానం చెప్పాలి. రద్దు చేసిన కళాశాల, ఇతర పనుల నిధులు ఇచ్చాకనే సిద్దిపేట ప్రజల ఓట్లు అడగడానికి రావాలి అంటున్న సిద్దిపేట నియోజకవర్గ ప్రజలు’
సిద్దిపేట వెటర్నరీ కళాశాల రద్దు..
సీఎం రేవంత్‌రెడ్డి సిద్దిపేట వెటర్నరీ కళాశాలను కొడంగల్ నియోజకవర్గానికి తీసుకుపోయాడు. కళాశాల పనులను మధ్యలో ఆపి తరలించుకు పోవడంపై ఇక్కడి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. జిల్లాకేంద్రంలో కేసీఆర్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే, మాజీమంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి మేరకు కలెక్టరేట్ కార్యాలయ సమీపంలో (పీవీ నరసింహరావు తెలంగాణ పశువైద్య విద్యాలయం) వెటర్నరీ కళాశాలను మంజూరు చేశారు.ఈ భవన సముదాయానికి 30ఎకరాల విస్తీర్ణంలో బాలురు, బాలికల వసతితో పాటు కళాశాల నిర్మాణం చేపట్టేలా రూపకల్పన చేశారు. ఇందుకు రూ.180 కోట్లు అప్పటి కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసింది.
రాష్ట్రంలో పశు సంపద పెరగడంతో విప్లవాత్మక మార్పు తెచ్చిన కేసీఆర్ మూగజీవాలకు కూడా ఆ స్థాయిలో వైద్యం అందించాలనే గొప్ప సంకల్పంతో పశువైద్య విద్యకు ప్రోత్సాహాన్ని ఇచ్చారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లాలో నిర్మించిన రిజర్వాయర్ల ద్వారా పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. పశుసంపద బాగా వృద్ధి చెందింది. కోళ్ల పెంపకంలో రాష్ట్రంలోనే సిద్దిపేట జిల్లా అగ్రస్థానంలో ఉంది. జిల్లాతో పాటు చుట్టుపకల జిల్లాలకు అందుబాటులో ఉండేలా ఇకడ ప్రభుత్వ వెటర్నరీ కళాశాలను ఏర్పాటు చేయడానికి పూనుకుని రూ.100 కోట్ల నిధులు కేటాయించి పనులు ప్రారంభించింది.
2024 విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించడానికి ఉత్తర్వులు విడుదల చేశారు. మన రాష్ట్రంలో హైదరాబాద్, కోరుట్ల, వరంగల్‌లో ఉన్న మూడు పశువైద్య కళాశాలల ద్వారా సుమారు 240 మంది పశు వైద్యులు ఉత్తీర్ణులవుతున్నారు. రాష్ట్రంలో ఉన్న పశుసంపదకు, పెరుగుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకొని సరిపడా పశు వైద్యులను తీర్చిదిద్దుటకు ఈ ప్రాంతానికి కళాశాల మంజూరు చేశారు. కళాశాల నిర్మాణంతో ఈ ప్రాంత విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది అనుకున్న తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రచేసి నిర్మాణంలో ఉన్న కళాశాల పనులు మధ్యలో ఆపి ఆ కళాశాలను కొడంగల్ నియోజకవర్గానికి సీఎం రేవంత్‌రెడ్డి తరలించుకుపోయారు.
రూ.150 కోట్ల రహదారుల నిధులు రద్దు
కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దిపేట జిల్లాపై కక్ష కట్టింది. సుమారుగా రూ.150 కోట్ల మేర రహదారుల నిధులను రద్దు చేసి ఇతర జిల్లాలకు మళ్లించిందిరు. గజ్వేల్ నియోజకవర్గంలోని పీడబ్ల్యూ రోడ్డు నుంచి కొల్గూరు మీదుగా అహ్మదిపూర్ (0/0 నుంచి 4/0)వరకు రూ.3 కోట్లు, మీనాజీపేట నుంచి బస్వాపూర్ మీదుగా కొక్కండ (0/0 నుంచి 0/10)వరకు రూ.3 కోట్లు, రాజీవ్ రహదారి పీడబ్ల్యూ రోడ్డు మీదుగా ముట్రాజ్‌పల్లి ( 0/0 నుంచి 7/2)వరకు రూ.30 కోట్లు, మర్కూక్ నుంచి నారాయణపూర్ (0/0 నుంచి 10/0) వరకు రూ.23 కోట్లు మంజూరు చేసింది. ఈ రోడ్డు పనులు పురోగతిలో ఉన్నాయి.
సంగారెడ్డి జిల్లాలోని హత్నూర్ మండలం టౌన్ లిమిట్స్ దౌల్తాబాద్ -చిట్కుల్ రహదారి విస్తరణ (కి.మీ 5/3 నుంచి 8/2)రూ. 8 కోట్లు, సిద్దిపేట – ఇల్లంతకుంట ఫోర్‌లేన్ రోడ్డు( కి.మీ 22/0 నుంచి 32/0) రూ.82 కోట్లు (రాజన్నసిరిసిల్ల జిల్లా), సిద్దిపేట -ఇల్లంతకుంట ఫోర్‌లేన్ రోడ్డు (కి.మీ 10/0 నుంచి 22/0) రూ.77 కోట్లు , సంగారెడ్డి- నర్సాపూర్ -తూప్రాన్ రోడ్డు (కి.మీ 71/0 నుంచి 72/5, 77/4 నుంచి 78/4)(ఆరు వరుసల రహదారి సిద్దిపేట జిల్లాలో) రూ.19 కోట్లను కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ పనులకు సంబంధించి నిధులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేస్తూ 305 జీవోను జారీ చేసి ఇతర జిల్లాలకు ఈ నిధులను మళ్లించింది.
సిద్దిపేట జిల్లా రద్దుకు కుట్ర
సిద్దిపేట జిల్లా ఎన్నో ఏండ్ల కల..ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ. తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ ప్రభుత్వం సిద్దిపేట జిల్లాను ఏర్పాటు చేసింది. నూతన సమీకృత కలెక్టరేట్ నిర్మాణంతోపాటు రెవెన్యూ డివిజన్లు, నూతన మండలాలు ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు జరిగింది. సమైక్య రాష్ట్రంలో ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా జిల్లాను ఏర్పాటు చేయలేదు. కేసీఆర్ సీఎం అయ్యాక జిల్లా ఏర్పాటు కావడంతో అన్ని రంగాల్లో సిద్దిపేట జిల్లా అగ్రగామిగా నిలిచింది. దీనిని జీర్ణించుకోలేని కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దిపేట జిల్లా రద్దుకు కుట్రలు చేస్తున్నది. జిల్లాల రద్దుపై జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నది. తద్వారా ప్రజలకు సేవలు దూరం కానున్నాయి.