సిద్దిపేట, మే 18( నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ హరితహారం కింద నాటిన మొక్కలు ఎండిపోతున్నాయి. మొక్కల సంరక్షణ బాధ్యతలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసింది. కండ్ల ఎదుట హరితహారంలో మొక్కలు కాలిపోతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పసిపిల్లలా సాకిన మొక్కలు నేడు నీళ్లులేక మోడువారి పోతున్నాయి. ఎనిమిదేండ్లుగా పెంచి పెద్దచేసిన చెట్లు ఇవాళ ఎండిపోయి కనిపిస్తున్నాయి. గ్రామాల్లో పచ్చని తోరణాలుగా స్వాగతం పలికిన చెట్లు నేడు ఎండిపోయాయి. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తుంది. గ్రామాల్లో, పట్టణాల్లో పల్లె ప్రకృతి వనాలు ఎండి పోతున్నాయి. గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీల పరిస్థితి అంతంత మాత్రమే అని చెప్పాలి.
ఎనిమిదేండ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏటా జూన్ వచ్చిందంటే పెద్దఎత్తున హారితహారం కింద మొక్కలు నాటేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకునే వారు. గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద తెలంగాణకు హరితహారం లో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాలో విరివిగా మొక్కలు నాటారు. ఎనిమిది విడుతల్లో 16.58 లక్షల మొక్కలను నాటారు. తెలంగాణ హరితహారంలో భాగంగా ఇరిగేషన్ ల్యాండ్, కమ్యూనిటీ ప్లాంటేషన్, ఇన్సిట్యూట్ ప్లాంటేషన్, అవెన్యూ ప్లాంటేషన్ కింద ఈత మొక్కలు, నీలగిరి తదితర సుమారుగా 5 కోట్ల మొక్కలు నాటారు. వీటి సంరక్షణ బాధ్యత తీసుకొని ప్రతి మొక్కనూ కేసీఆర్ ప్రభుత్వం బతికించుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కడ చూసినా ఎండిన చెట్లు కనిపిస్తున్నాయి. రహదారుల కిరువైపులా ఎండిపోయిన, కాలిన చెట్లు కనిపిస్తున్నాయి. వారం రోజుల కిందట రాజీవ్ రహదారి పక్కన నాటిన మొక్కలు కాలి బూడిదయ్యాయి. ఇది ఎక్కడనో కాదు సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ భవనానికి కూత వేటు దూరంలోనే.. నిత్యం ఇక్కడి నుంచి జిల్లా అధికారులు వస్తూ.. పోతూ ఉంటారు. కానీ ఈ విషయం వారికి కనిపించదు. రాజీవ్ రహదారికి ఇరువైపులా నాలుగు వరుసలా మొక్కలు నాటారు. వాటి సంరక్షణ కోసం కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంది.
ఎండుతున్నా పట్టించుకున్నవారే కరువు
సిద్దిపేట జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హరితహారం కింద మొ క్కలను పెద్దఎత్తున నాటారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో హరితహా రం కింద నాటిన మొక్కలు ఎండిపోతున్నాయి. మరికొన్ని చోట్ల చెత్తాచెదారాన్ని తగల బెట్టడంతో రోడ్డు పక్కన ఉన్న వందలాది మొక్కలు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. అధికార యంత్రాంగం కళ్లెదుట జరుగుతున్నా పట్టించుకోవడం లేదన్న విమర్శలు బలంగా ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొక్కలు నాటేందుకు, వాటిని సంరక్షించేందుకు ప్రత్యేక కమిటీలు ఉన్నాయి.
గ్రామ స్థాయిలో హరితరక్షణ కమిటీలు, మొక్కలు నాటడం, సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించేవి. గ్రామస్థాయిలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, హరితరక్షణ కమిటీలు, యువతను భాగస్వామ్యం చేస్తూ హరితహారం కార్యక్రమాన్ని కేసీఆర్ ప్రభుత్వంలో విజయవంతం చేసి నాటిన ప్రతి మొక్కనూ కాపాడుకున్నారు. రోడ్డుకిరువైపులా మొక్కలు నాటడమే కాక వాటిని సంరక్షించడం కోసం వార్డు వాచ్లను నియమించారు. మొక్కల సంరక్షణకు ట్రీ గార్డులను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అవి ఒక్కటి కూడా కనిపించడం లేదు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ప్రతిఏటా మొక్కలను నాటారు. గ్రామానికి వెళ్లే రహదారికి ఇరువైపులా మొక్కలు నాటడంతో పచ్చని తోరణాలు స్వాగతం పలికినట్లుగా ఉన్నాయి. వాటికి ఇప్పుడు సరిపడా నీరు లేకపోవడంతో ఎక్కడికక్కడ ఎండిపోతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లలో, అవెన్యూ ప్లాంటేషన్ కింద మొక్కలు నాటడానికి 23 రకాల మొక్కలను నాటి ఏపుగా పెంచారు. ప్రస్తుతం నీళ్లు లేక ఎండిపోతున్నా వాటిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
ఎండిన హరితహారం మొక్కలు
బీఆర్ఎస్ సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్ర మం ఇప్పుడు పరిహాసమవుతోంది. మండలంలోని కాశేగుడిసెల గ్రామ పంచాయతీ పరిధిలో నాటేందుకు తీసుకువచ్చిన మొక్కలు ఎండిపోయాయి. స్థానిక పాఠశాల సమీపంలో ఎండిపోయిన మొక్కలు దర్శనం ఇస్తుండడంతో అటువైపుగా వెళ్లిన ప్రతిఒక్కరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు మొక్కలను కాపాడేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.