గజ్వేల్, జనవరి 12 : నిరంతర లక్ష్యసాధన చేయడానికి యువతకు స్వామి వివేకానంద స్ఫూర్తి ప్రదాత అని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి అన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని గురువారం పట్టణంలోని ప్రభుత్వ దవాఖాన కూడలి వద్ద ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. యువజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ జకియొద్దీన్తో పాటు యువజన సంఘాల నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొని, వివేకానందకు నివాళులర్పించారు. జాతీయ యువజన అవార్డు గ్రహీత దేశబోయిని నర్సింహులు సేవా వలంటరీ సంస్థ ఆధ్వర్యంలో విస్తృతంగా సమాజసేవా కార్యక్రమాలు చేపడుతున్నవారిని, యువత, క్రీడాకారులను సన్మానించారు. స్వామి వివేకానంద సొసైటీ, వాణీవిద్యాలయం, బార్అసోసియేషన్ న్యాయవాదులు, తదితరులు వివేకాంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమీకృత వ్యవసాయ మార్కెట్లో ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, కౌన్సిలర్ గోపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు నవాజ్‌మీరా, మార్కెట్ సిబ్బంది, డైరెక్టర్లు పాల్గొన్నారు.
విద్యార్థులు పుస్తకాలు చదవాలి..
విద్యార్థులు పాఠశాల దశ నుంచి పుస్తకాలను చదవడం అలవర్చుకోవాలని, అప్పుడే ప్రతిఒక్కరిలో జ్ఞానం పెరుగుతుందని ఎమ్మెల్సీ యాదవరెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ రోజాశర్మ అన్నారు. గురువారం ప్రజ్ఞాపూర్ సెయింట్ మేరీస్ విద్యానికేతన్ పాఠశాలలో ఇంటింటా గ్రంథాలయం, సంక్రాంతి సంబురాలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ కనబరిచి పుస్తకాలు చదివేవిధంగా ప్రోత్సహించాలన్నారు. ప్రతి ఇంటిలో చిన్నపాటి గ్రంథాలయం ఏర్పాటు చేసుకోవాలన్నారు. దేశంలో అత్యధిక పుస్తకాలు డాక్టర్ అంబేద్కర్ చదివిన వ్యక్తిగా నిలిచారన్నా రు. ఆయను స్ఫూర్తిగా తీసుకొని ప్రతిఒక్కరూ పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్, వైస్ చైర్మన్ జకీ, జడ్పీటీసీ మల్లేశం. ఆత్మ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, కరస్పాండెంట్ ఇన్నారెడ్డి, డైరెక్టర్లు థామస్‌రెడ్డి, ప్రిన్సిపాల్ రాయప్ప, విజయపాల్‌రెడ్డి, యాదవరెడ్డి పాల్గొన్నారు.