చిన్నకోడూరు, ఏప్రిల్ 11: ‘గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కరువు ఏర్పడితే మూగజీవాలు పశుగ్రాసం దొరకక కబేళాలకు వెళ్లాయి. పశుగ్రాస కేంద్రాలు ఏర్పాటు చేసి పశువులను బతికించుకోవాలని ఆంధ్ర ప్రాంతాల నుంచి గడ్డి తీసుకొచ్చి మూగజీవాలను బతికించుకున్నాం’.. అని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం పెద్దకోడూరులో బుధవారం మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, ఎంపీపీ మాణిక్యరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గెలుపు చాలా ముఖ్యమన్నారు. కాంగ్రెస్ పాలన ఏ పాటిదో ప్రజలకు అర్థమైందన్నారు. వైఎస్ ఉన్నప్పుడు ఆరు గంటల కరెంటు ఇస్తే, రూ.90 వేల కోట్లు ఖర్చు చేసి కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇచ్చారన్నారు. కేసీఆర్ హయాంలో రైతుల సాగునీటి కష్టాలు తొలిగాయన్నారు. అప్పుడు నిండుకుండాలా ఉన్న జలాశయాలు, ఇప్పుడు ఎండిపోయి దర్శనమిస్తున్నామని తెలిపారు. సీఎంగా కేసీఆర్ కాలు పెడితే పదేండ్లు కరువు లేదన్నారు. కాంగ్రెస్ వచ్చి.. కరువు తెచ్చిందన్నారు. ఏ ఒక్క హామీని కాంగ్రెస్ నెరవేర్చలేదన్నారు. మీరు బీఆర్ఎస్కు ఎంపీ సీట్లు ఇస్తే హామీలపై కాంగ్రెస్‌ను నిలదీస్తామన్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు మనకు నష్టం చేశారన్నారు. ఉప ఎన్నికలో అనేక హామీలు ఇచ్చి అరచేత వైకుంఠం చూపారని తెలిపారు.
దుబ్బాకలో చెల్లని వ్యక్తి ఇక్కడ ఎలా చెల్లుతాడన్నారు. ఎన్నడూ జైతెలంగాణ అనని రేవంత్‌రెడ్డి సీఎం అవ్వడం మన దురదృష్టమన్నారు. జైతెలంగాణ అనే వాళ్లను కాల్చి పడేస్తా అన్నాడని గుర్తుచేశారు. గోదావరి నీళ్లు వచ్చి పంటలు పండితే ముద్ద తింటున్నామని, ఇంటింటా తిరిగి ప్రజలకు వాస్తవాలు చెప్పాలన్నారు. నోటి కాడి బుక్క పోగొడుతున్నారు. నిజమైన రైతునేస్తం కేసీఆర్ మాత్రమేనని హరీశ్‌రావు పేర్కొన్నారు. మోసాలు చేసిన కాంగ్రెస్‌కు ఎలా ఓటు వేస్తారని, మనం మోసపోకుండా మేలుకోవాలని చెప్పారు. మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి పేద విద్యార్థుల చదువు కోసం రూ.వంద కోట్లతో ట్రస్ట్ ఏర్పాటు చేస్తారన్నారు. కార్యకర్తలు పేదల ఇండ్లలో పెండ్లిండ్లు అయితే ఉచిత ఫంక్షన్ హాల్ సేవలు ప్రకటించారని, 30 రోజులు కష్టపడితే అందరం కలిసి ఇక్కడి ప్రాంత అభివృద్ధికి పాటుపడదామన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. గులాబీ జెండా కప్పుకున్నవాళ్లే ఢిల్లీలో జైతెలంగాణ అంటారని, గులాం గిరీ చేసేవాళ్లు మనకెందుకన్నారు. సన్నాహక సమావేశంలో పాల్గొన్న నాయకులు కార్యకర్తలకు ఎమ్మెల్యే హరీశ్‌రావు స్వయంగా వడ్డించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కాముని శ్రీనివాస్, సొసైటీ చైర్మన్లు కనకరాజు సదానందంగౌడ్, వైస్ ఎంపీపీ పాపయ్య, మెదక్ ఉమ్మడి జిల్లా గొర్లకాపరుల మాజీ అధ్యక్షుడు శ్రీ హరి యాదవ్, సీనియర్ నాయకులు బాల్‌రెడ్డి, రామచంద్రం, బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు గుండెలి వేణు, బీఆర్ఎస్వీ మండల అధ్యక్షుడు రాజు, ఎంపీటీసీలు, ఆయా గ్రామాల మాజీ సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సుదీర్ఘకాలంగా ఎక్కడైతే కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించానో.. అక్కడే పేదలకు సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నా రు. కేసీఆర్, హరీశ్‌రావు సహకారంతో, మీ అందరి ఆశీస్సులతో గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్లో తెలంగాణ గళం వినిపించి, ఇక్కడి ప్రజల సమస్యలకు పరిష్కారం చూపుతానన్నారు. అధికారిగా మీ అందరికీ సేవలు అందించానని, ఇక మీదట ఎంపీగా ప్రజలకు సేవ చేస్తానన్నారు. ఇక్కడి ప్రజల కష్టం, సుఖం తెలుసు. నా చివరి శ్వాస వరకూ ప్రజా సేవలో ఉంటానన్నారు. విద్యకు ప్రాముఖ్యత ఇచ్చి పేద పిల్లల కష్టం తీర్చేలా రూ.వంద కోట్లతో ట్రస్ట్ ఏర్పాటు చేస్తానన్నారు. ప్రజా జీవితంలో ఉన్నా నేను పెద్ద రాజకీయ నాయకుడిని కాదని, మీలో ఒకడిగా ఉంటానన్నారు. నాకు ప్రజలకు మంచి చేయడమే తెలుసన్నారు. గెలిచిన 30 రోజుల్లో ట్రస్ట్ ఏర్పాటు చేస్తాను. 15 రోజుల్లో ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేస్తానన్నారు. దీంతోపాటు నియోజకవర్గానికి ఒక ఫంక్షన్ హాల్ నిర్మిస్తానన్నారు. కార్యకర్తలు, పేదలకు ఉచితంగా సేవలు అందిస్తామన్నారు. కార్యకర్తలకు తప్పకుండా ప్రాధాన్యం ఇస్తామన్నారు. యువతకు నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి మంచి ఉద్యోగాలు సాధించేలా కృషి చేస్తానని, మంచి మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.