గజ్వేల్, డిసెంబర్ 27: తెలంగాణ కంచిగా పేరుగాంచిన వరదరాజస్వామి దేవాలయం పూర్వ వైభవానికి నోచుకుంటున్నది. గజ్వేల్ నియోజకవర్గంలోని మర్కూక్ మండలం వర్ధరాజ్‌పూర్ గ్రామంలోని వరద రాజస్వామి దేవాలయానికి సుమారు 450 ఏండ్ల చరిత్ర ఉంది. గులాబీ అధినేత కేసీఆర్ కృషితో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఆలయాల పునరుజ్జీవ పనులకు నిధులు మంజూరీ చేశారు. ఆయన కృషితో నేడు ఆలయాలు పూర్వవైభవాన్ని సంతరించుకుంటున్నాయి. ఎంతో ప్రత్యేకత కలిగిన ఆలయాన్ని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించడంతో ఆలయానికి మహర్దశ పట్టింది. ఆలయ నిర్మాణ పనులు చేసేందుకు రూ.10 కోట్లు మంజూరు చేయడంతో గతేడాది నుంచి పనులు చకచకా కొనసాగుతున్నాయి. వందల ఏండ్ల నాటి ఆలయ చరిత్ర కలిగిన వరదరాజస్వామి దేవాలయం త్వరలోనే తెలంగాణ కంచిగా పూర్వవైభవాన్ని సంతరించుకోనున్నది.
కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ప్రారంభోత్సవం రోజున వరదరాజస్వామి ఆలయాన్ని అప్పటి సీఎం కేసీఆర్ దర్శించారు. ఆలయానికి పూర్వవైభవం తీసుకురావాలని సంకల్పించి, అప్పట్లో నిర్మాణ పనులకు రూ.10 కోట్లు మంజూరుచేశారు. గ్రామాభివృద్ధికి మరో రూ.10 కోట్లు అదనంగా మంజూరు చేశారు. దీంతో వరదరాజస్వామి ఆలయ గోపురం, ముఖద్వారానికి రూ.70 లక్షలు, ఆలయంలోని హనుమాన్ ఆలయ నిర్మాణానికి రూ.80 లక్షలు, పెద్దమ్మతల్లి ఆలయానికి రూ.81.50 లక్షలు అప్పట్లో ప్రభుత్వం మంజూరు చేసింది. కంచిలోని వరదరాజస్వామి ఆలయాన్ని ఆర్అండ్బీ అధికారులు పరిశీలించిన తరువాత కంచి ఆలయానికి దీటుగా నిర్మిస్తున్నారు. ఆలయ పనులు ప్రస్తుతం యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి.
వరదరాజస్వామి ఆలయానికి గతంలో ఉన్న త్రికలశ గోపురం మాదిరిగానే ప్రస్తుత డిజైన్‌ను రూపొందించి పనులు చేపడుతున్నారు. గోపురం నుంచి స్వామివారి రథం వచ్చిపోయేలా అత్యద్భుతంగా డిజైన్చేసి పనులను చేయిస్తున్నారు. గోపురంలో వరదస్వామి ప్రతిమలు, శ్రీభూనీల అమ్మవారి ప్రతిమలు రానున్నాయి. ఈ పనులు వడివడిగా కొనసాగుతున్నాయి. వరదరాజస్వామి ఆలయాన్ని పూర్వ త్రికలశ గాలిగోపురాలతో నిర్మించి, ఆలయ ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఆలయంలోని బంగారుబల్లి, తొండలను భక్తులు దర్శించుకుని తమ పాపాలు తొలిగించాలని కోరుకుంటారు. 450 ఏండ్ల కిందట రాతికట్టడాలతో నిర్మాణమైన ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో పనులు చేపట్టేందుకు అప్పట్లో కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో ప్రత్యేక చొరవ తీసుకుని నిధులు మంజూరుచేశారు. ప్రస్తుతం ఆయల పనులను పూర్తిస్థాయిలో రాతికట్టడంతో చేపడుతున్నారు. ఆలయ గర్భగుడికి కొత్త రూపం సంతరించుకునేలా నిర్మిస్తుండగా గోడలకు సహజ సిద్ధమైన రాతితో తాపడాన్ని చేస్తున్నారు. ఆలయ గోపురం సిమెంట్‌తో నిర్మించగా పీఠం, ఉపపీఠం, స్తంభవర్గం, సహజ సిద్ధమైన పనులను రాతితో తాపడాన్ని చేస్తున్నారు. త్రికలశ గాలిగోపురాన్ని యథావిధిగా నిర్మించారు. అధ్యయన మండపం, హోమశాలలు నిర్మిస్తున్నారు. పంచలోహ సమేత ధ్వజపీఠం యథావిధిగా ప్రతిష్ఠించనున్నారు. స్వామికి ద్వారపాలకులైన జయ, విజయలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకు సగానికిపైగా పనులు పూర్తయ్యాయి. అందులోభాగంగా చేపట్టిన పెద్దమ్మతల్లి ఆలయ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. హనుమాన్ ఆలయ పనులు తుదిదశకు చేరుకున్నాయి.