గజ్వేల్, జూలై 29: రాష్ట్ర ప్రజలు 16 మంది ఎంపీలను గెలిపిస్తే రైతులకు యూరియా సంచి పంపిణీ చేసి దిక్కు లేదని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గం ఇన్చార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి (Vanteru Pratap Reddy) అన్నారు. మంగళవారం గజ్వేల్ లోని అగ్రో రైతు సేవ కేంద్రం వద్ద రైతులతో కలిసి మాట్లాడారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు సకాలంలో యూరియా పంపిణీ చేయడంలో విఫలమైందని, ప్రస్తుతం రైతులు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ రైతంగానికి అండగా నిలబడిన రోజులను గుర్తు చేస్తున్నారని తెలిపారు. రైతులకు ఎకరాకు రెండు బస్తాలు కాకుండా వారి అవసరం మేర పంపిణీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం, అధికారులపై ఉందన్నారు.
రైతులకు యూరియా దొరకక క్యూలైన్లో నిలబడుతూ నిరీక్షిస్తున్నారని, అయినా ప్రభుత్వం పంపిణీ చేయడం లేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా యూరియా ఉందని చెప్తున్నారు. కానీ రైతులకు ఎక్కడా కూడా యూరియా దొరకపోవడంతో పాస్ పుస్తకాన్ని లైన్ లో పెట్టి నిలుచుకునే పరిస్థితి కనిపిస్తుంది అన్నారు. కార్యక్రమంలో ఏఎంసి మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి, పార్టీ అధ్యక్షులు బెండ మధు, నమాజ్ మీరా, నాయకులు శ్రీనివాస్ రెడ్డి కృష్ణారెడ్డి, దయాకర్ రెడ్డి, నరసింగరావు, గుంటుక రాజు, కనకయ్య, చందు తదితరులు పాల్గొన్నారు.