సిద్దిపేట, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి మెదక్ స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వంటేరి యాదవరెడ్డి ఘనవిజయం సాధించారు. తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి తూర్పు నిర్మలపై 524 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సొంతం చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 1026 ఓట్లకు గాను 1018 ఓట్లు పోలయ్యాయి. మంగళవారం మెదక్‌లో నిర్వహించిన కౌంటింగ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ యాదవరెడ్డికి 762 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థికి 238 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి మల్లారెడ్డికి 06 ఓట్లు వచ్చాయి. కాగా, 12 ఓట్లు చెల్లుబాటు కాలేదు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ విజయం సాధించింది. ఆ మేరకు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, మెదక్ కలెక్టర్ హరీశ్ చేతుల మీదుగా ఎమ్మెల్సీ సభ్యులు శేరి సుభాష్‌రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డితో కలిసి డాక్టర్ యాదవరెడ్డి గెలుపు ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. శాసనమండలి ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించడంపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సంబురాలు అంబరాన్నంటాయి. సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవ తీసుకొని స్థానిక శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, సీనియర్ నాయకులు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల సహకారంతో శాసనమండలి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి భారీ విజయాన్ని సొంతం చేశారు. శాసనమండలి ఎన్నికల్లో గెలుస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ నేతల మాటలు నీటి మూటలుగా మారాయి. ఉత్త మాటలు తప్ప, ఆ పార్టీ విజయాలు సాధించింది ఒక్కటి కూడా లేదని చెప్పాలి. ప్రజల్లో గందరగోళం సృష్టించడం తప్ప మరోటి లేదు. స్థానిక సంస్థల్లో మెజార్టీ ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ వారే ఉన్నారు. 90శాతానికి పైగా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులున్నప్పటికీ పోటీలో నిలిచిన కాంగ్రెస్ పార్టీకి శాసనమండలి ఎన్నికల్లో తగిన శాస్తిని చేశారు.
అంబరాన్నంటిన సంబురాలు..
స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించడంపై మంగళవారం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలోని జిల్లా కేంద్రాలతో పాటు నియోజకవర్గ, మండల కేంద్రాలతో పాటు గ్రామాల్లో పటాకులు కాల్చి, స్వీట్లు పంచారు. పట్టణ, మండల కేంద్రాల్లో జరిగిన సంబురాల్లో టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
జయహో టీఆర్ఎస్..
స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించడంపై మరోసారి ఉమ్మడి మెదక్ జిల్లా టీఆర్ఎస్ పార్టీకి కంచుకోట అని రుజువైంది. ఎన్నికలు ఏవైనా, అది టీఆర్ఎస్ పార్టీ సొంతం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పాటైన నాటి నుంచి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి పట్టం కడుతున్నారు. సిద్దిపేట ముద్దుబిడ్డ సీఎం కేసీఆర్ కావడంతో ఉమ్మడి మెదక్ జిల్లా టీఆర్ఎస్ వెంటే ఉంటున్నారు. గతంలో జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే ప్రతి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయ పరంపర కొనసాగింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని 10 శాసనసభ స్థానాలకు గానూ 9 స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. రెండు పార్లమెంట్ స్థానాలకు గానూ రెండింటినీ సొంతం చేసుకున్నది. ఆ తర్వాత జరిగిన గ్రామ, మండల పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటింది. ప్రతి జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది. మూడు జిల్లా పరిషత్‌లను కైవసం చేసుకున్నది. అనంతరం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అన్నింటా విజయబావుట ఎగురవేసి ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదని చాటి చెప్పింది. తర్వాత వచ్చిన కార్పొరేషన్ ఎన్నికల్లోనూ రెండు స్థానాలకు గానూ రెండు చోట్ల విజయం సాధించింది.
జాగా జరిగిన ఉమ్మడి స్థానిక సంస్థల
శాసనమండలికి ఎన్నికల్లో 524 ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి యాదవరెడ్డి విజయం సాధించారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, శ్రేణులు సంఘటితంగా పని చేయడం మూలంగానే భారీ విజయాలను
సొంతం చేసుకుంటున్నది. సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యం కలగడంతో పాటు స్థానిక సంస్థలను బలోపేతం చేయడంతో అంతా టీఆర్ఎస్ వైపు ఉన్నారని మరోసారి రుజువు చేశారు.