న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: ఇరాన్‌పై పూర్తి స్థాయి యుద్ధానికి అమెరికా సన్నాహాలు చేస్తున్నదా? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తున్నది. వెనెజువెలా ఆపరేషన్‌కు ఉపయోగించిన యుద్ధ నౌక యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ని పశ్చిమాసియాకు తరలించడానికి అమెరికా అధ్యక్షుడు సన్నాహాలు చేస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహక నౌక గెరాల్డ్ అక్కడకు చేరితే ఇప్పటికే పశ్చిమాసియాలో మోహరించిన అమెరికా యుద్ధ నౌకలకు మరింత బలం చేకూరనున్నది.
మరోపక్క అణు కార్యక్రమంపై తమతో ఒప్పందం కుదుర్చుకోవాలని ట్రంప్ ఇరాన్‌పై ఒత్తిడి పెంచుతున్నారు. ఇరాన్‌తో మరోదఫా చర్చలు ఉంటాయని ట్రంప్ ప్రకటించిన కొన్ని రోజుల్లోనే తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయి. అయితే ఒమన్, ఖతార్‌లో ఈ వారంలో అమెరికా మధ్యవర్తులతో ఇరాన్‌కు చెందిన ఉన్నతస్థాయి భద్రతాధికారులు జరిపిన చర్చలు ఫలప్రదం కానట్లు తెలుస్తున్నది.