అక్కన్నపేట, ఫిబ్రవరి 17 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని పంతుల్తండాలో భర్త తాగిన మైకంలో భార్యను హత్య చేశాడు. అంతేకాకుండా శవాన్ని పూడ్చేందుకు ప్రయత్నించగా, స్థానికులు గమనించి పోలీసులు సమాచారం అందించగా నిందుతుడి అదుపులోకి తీసుకున్నారు.
హుస్నాబాద్ ఏసీపీ వాసాల సతీష్ తెలిపిన వివరాల ప్రకారం.. పంతుల్తండాకు చెందిన జాటోతు స్వామి తన భార్య మణెమ్మ(45) మధ్య వారం రోజుల నుంచి భూమి రిజిస్ట్రేషన్ విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గత రెండు రోజులు స్వామి మద్యం తాగి ఇంటికి వస్తున్నాడు. బుధవారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చిన స్వామి ఎవరూ లేని సమయంలో భార్యతో గొడవపడ్డాడు.
క్షణికావేశంలో మణెమ్మ తలను గోడకు వేసి బాదాడు. దీంతో మణెమ్మ అక్కడికక్కడే మృతి చెందంతో మృతదేహాన్ని ట్రాక్టర్లో తీసుకవచ్చి అక్కన్నపేట ప్రభుత్వ దవాఖాన వద్ద పూడ్చివేసేందుకు ప్రయత్నిస్తుండగా..స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
అక్కడికి చేరుకున్న పోలీసులు స్వామిని అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. కాగా, సంఘటన స్థలాన్ని హుస్నాబాద్ సీఐ రఘు, ఏసీపీ సతీష్ సందర్శించారు.