రాయపోల్, మే 30 : సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని ఆగ్రో రైతు సేవ కేంద్రంతో పాటు యాదాద్రి ట్రేడర్స్ షాపులను టాస్క్‌ఫోర్స్ టీమ్ శుక్రవారం తనిఖీ చేశారు. అనంతరం విత్తన డీలర్స్ అందరితో రాయపోల్‌లోని రైతు వేదికలో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా గజ్వేల్ డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులు బాబు నాయక్, రాయపోల్ మండల ఏఎస్సై రాజు మాట్లాడుతూ.. విత్తన డీలర్స్కు విత్తన చట్టం, నియమనిబంధనలు వివరించామని తెలిపారు. ప్రతి రైతుకు ప్రతి డీలర్ కచ్చితంగా బిల్లు ఇవ్వాలని సూచించారు. అలాగే స్టాక్ వివరాలను, ధరల పట్టికలను ప్రతి డీలర్ షాపునందు ఉంచాలని, స్టాక్ రిజిస్టర్లు, బిల్లు బుక్‌లను ప్రతిరోజు రాయాలన్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను ఎమ్మార్పీ రేటుకు మించి అమ్మిన, కాలం గడిచిన విత్తనాలు, పురుగుల మందులు అమ్మినా విత్తన చట్టం, పురుగుల మందుల చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లైసెన్స్ ఉన్న డీలర్ల వద్దనే విత్తనాలను కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు. డీలర్స్ నుంచి రైతులు కచ్చితంగా బిల్లు తీసుకోవాలని, దాన్ని భద్రపరుచుకోవాలన్నారు.