మద్దూరు (ధూళిమిట్ట), సెప్టెంబర్09 : సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని లద్నూర్‌లో బస్సు సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉపసర్పంచ్ బెడద శివకుమార్ ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపసర్పంచ్ మాట్లాడుతూ నిత్యం ఎంతోమంది విద్యార్థులు చదువుకునేందుకు జనగామ జిల్లా కేంద్రానికి వెళ్లుతుంటారని, బస్సులు లేకపోవడం వల్ల విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని తెలిపారు. గతంలో ఉదయం వేళలలో వచ్చిన బస్సును జనగామకు వెళ్లకుండా హైదరాబాద్‌కు మళ్లించడంతో విద్యార్థులు మధ్యలోనే దిగి ఇతర బస్సులు ఎక్కి జనగామకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆర్టీసీ అధికారులు తక్షణమే స్పందించి, విద్యార్థుల సౌకర్యార్ధం ప్రత్యేకంగా బస్సును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేవారు. లేనిపక్షంలో విద్యార్థులతో కలిసి ఆందోళనలను ఉదృతం చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఇర్రి రాజిరెడ్డి, మాజీ సర్పంచ్ జీడికంటి సుదర్శన్, జీడికంటి సురేశ్, రామడుగు బాలరాజు, నాయకులు దాసరి పద్మారెడ్డి, అన్నోజు శ్రీనివాస్, సోగాల మనోజ్, వార్డు సభ్యులు పూల శరత్‌బాబు, అన్నోజు మంజుల తదితరులు పాల్గొన్నారు.