రాయపోల్ అక్టోబర్ 11: వాడవాడల్లా కుక్కలు (Street Dogs) గుంపులుగా తిరుగుతూ జనాన్ని భయపెడుతున్నాయి. దీంతో రోడ్లపై తిరగాలంటేనే ప్రజలు, ప్రయాణికులు జంతుకుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాల్లో కుక్కల బెడద నెలకొన్నది. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో రోడ్డుపై నిత్యం కుక్కలు గుంపులు గుంపులుగా ఉండి వాహనాల రాకపోకలకు, ప్రజలకు ఇబ్బందిగా మారింది. మటన్ షాపులు, చికెన్ దుకాణాలతోపాటు ఫంక్షన్ హాల్ ఉండడంతో కుక్కల బెడదా మరింత తీవ్రంగా ఉందని స్థానికులు వాపోతున్నారు. గతంలో కుక్కలు కాటు వేసి హాస్పిటల్ పాలైన ఘటనలు అనేకం ఉన్నాయి. మండలంలోని మొత్తం 19 గ్రామ పంచాయతీలు ఉండగా ప్రతి గ్రామంలో కుక్కల బెడద తీవ్రంగా ఉంది.
అన్ని గ్రామాల్లో దాదాపు 3 వేల కుక్కలు ఉంటాయని ప్రజలు చెబుతున్నారు. శునకాలు ఎక్కడపడితే అక్కడ గుంపులు గుంపులుగా ఉండడంతో మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల వెళ్లాలంటే విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. కుక్కలు ఎప్పుడు తమపై దాడి చేస్తాయో అని భయపడుతున్నారు. మటన్ చికెన్ వ్యక్తపదార్థాలు వేస్తూ ఉండడంతో తినడానికి అక్కడికి చేరిపోయి కుక్కలు రెచ్చిపోతున్నాయి. పాఠశాలల ప్రధాన కుడళ్లు, రహదారులు కల్వర్టులు, వంతెనల వద్ద సేద తీరుతూ భయాందోళనలను కలిగిస్తున్నాయి. యజమానులు కుల్లిన వ్యర్థ పదార్థాలు వంతెనలు, కల్వర్టులు, కుంటలు తదితర వాటిలో వదిలిపెడుతున్నారు. దీంతో దారి వెంట వచ్చే పాదాచారులు, వాహనాదారులు కుక్కల భయంతో వనికి పోతున్నారు. కొన్నిచోట్ల కుక్కలు వాహనాదారుల వెంటపడి తరుముతూ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. వాటి నుంచి తప్పించుకునే క్రమంలో వాహనాల స్పీడు పెంచుతూ అదుపుతప్పి ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. గ్రామాల్లో కుక్కల బెడద లేకుండా చేయాలని ప్రజలు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.