దుబ్బాక, జూన్ 12: దుబ్బాక నియోజకవర్గంలో రోడ్ల విస్తరణతోపాటు, మరమ్మతులు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ఆర్అండ్బీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా రోడ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. ఆర్అండ్బీ ఎస్ఈ వసంతనాయక్తో మాట్లాడి రోడ్ల వివరాలు తెలుసుకున్నారు. గతంలో పలురోడ్లకు నిధులు మంజూరైనప్పటికీ నిర్మాణ పనులు ప్రారంభంకాలేదని, మరి కొన్నిచోట్ల నిధుల కొరతతో అర్థంతరంగా పనులు నిలిచిపోయాయని అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దుబ్బాక పట్టణంలోని రామసముద్రం, పెద్ద చెరువు కట్టల కింద రోడ్లపైకి చెరువు జాలు రాకుండా ప్రత్యేకంగా కాలువలు నిర్మించాలన్నారు. దుబ్బాక-హబ్షీపూర్ వరకు నాలుగులేన్ల రోడ్డుగా విస్తరణ పనులతోపాటు తిమ్మాపూర్-అందె, సూరంపల్లి-నాచారం, మొండిచింత-బేగంపేట సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా విస్తరించాని సూచించారు. దుబ్బాక మండలం గోసాన్‌పల్లి-శిలాజీనగర్ వద్ద బ్రిడ్జి నిర్మాణానికి, మిరుదొడ్డి మండలం అల్వాల బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. మెట్టు-అల్వాల రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. నియోజకవర్గంలో నూతనంగా నిర్మించే రోడ్లకు కావల్సిన నిధు లు మంజూరుకు కృషి చేస్తామని తెలిపారు. సమీక్షలో ఆర్అండ్బీ ఈఈ బాలప్రసాద్, డీఈ వెంకటేశం, ఏఈలు శ్రీనివాస్, విజయసారథి పాల్గొన్నారు.