Mother in law Murder | తొగుట, జూలై 12 : మానవ సంబంధాలు స్వార్థం మూలంగా మంటగలిసి పోతున్నాయి. నమ్మిన భార్య, భర్తలను నమ్మించి గొంతు కోస్తున్న సంఘటనలు చోటు చేసుకుండగా.. అత్త పేరు మీద బీమా చేయించి, తర్వాత హత్య చేయించి సొమ్ము చేసుకోవాలనే అల్లుడి కుట్ర సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని పెద్ద మాసాన్ పల్లిలో సంచలనం సృష్టించింది. నిందితులు ఈ హత్య కోసం దృశ్యం 2 సినిమాను స్పూర్తిగా తీసుకున్నామని చెప్పడం సంచలనం రేపుతోంది.
ఈ సంఘటనకు సంబంధించి సిద్దిపేట పోలీస్ కమీషనర్ డాక్టర్ అనురాధ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని పెద్దమాసాన్ పల్లికి చెందిన తాళ్ల వెంకటేష్ అదే గ్రామానికి చెందిన తాళ్ల కర్ణాకర్‌కు రూ.1,30,000 అప్పుగా ఇచ్చాడు. అదే విధంగా పౌల్ట్రీ ఫామ్ వ్యాపారం, వ్యవసాయం చేసి రూ.22 లక్షలు అప్పుల పాలయ్యాడు. ఇంకేంటి అత్త పేరు మీద బీమా పాలసీలు చేసి చంపేసి బీమా సొమ్మును పొందాలని పథకం పన్నాడు.
ఈ క్రమంలో తన స్వంత అత్త సిద్దిపేట పట్టణంలోని ఇందిరా నగర్‌కు చెందిన వికలాంగురాలైన తాటికొండ రామమ్మ (50) పేరున పోస్టాపీస్‌లో ఏడాదికి రూ.755 చెల్లించి రూ.15 లక్షల బీమా, ఎస్బీఐలో ఏడాదికి రూ.2000 చెల్లించి రూ.40 లక్షల బీమా చేయించాడు. అలాగే తన మిత్రుడు కర్ణాకర్ తండ్రి సత్తయ్య పేరు మీద ఉన్న భూమిని 0-28, గుంటలను అత్త రామమ్మ పేరు మీద చేయించి రూ. 5 లక్షల రైతు బీమా కోసం దరఖాస్తు చేశాడు. ఏదైనా వాహనంతో ఢీకొట్టి చంపేసి, ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించింది అని బీమా సొమ్ము కాజేయాలని కుట్ర పన్నాడు.
మిత్రుడైన కర్ణాకర్‌తో ఒప్పందం చేసుకుని..
ఇది తన ఒక్కనితో కాదని, మిత్రుడైన కర్ణాకర్‌తో ఒప్పందం చేసుకున్నాడు. నాకు ఇచ్చే రూ.1,30,000 ఇవ్వాల్సిన అవసరం లేదని, పైగా బీమా సొమ్ము చెరి సగం పంచుకుందామని మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 7న సిద్దిపేటలో TS 1802277 తార్ వాహనాన్ని కర్ణాకర్ సెల్ఫ్ డ్రైవింగ్ కోసం తీసుకున్నాడు. నేను ఈ రోజు పెద్దమాసాన్ పల్లి శివారులోని పొలం వద్దకు టీవీఎస్ వాహనం మీద తీసుకొని వచ్చాను. ఆమెను వాహనం మీద కూర్చోపెట్టి పొలంలోకి వెళ్లాను. నువ్వు కారుతో ఢీ కొట్టాలని వెంకటేష్ వాట్సాప్ కాల్లో కర్ణాకర్‌కు తెలియజేశాడు. ఆ తర్వాత తార్ వాహనంతో టీవీఎస్ వాహనం మీద ఉన్న రామమ్మను ఢీకొట్టి చంపేశానని కర్ణాకర్ తెలుపడంతో.. ఏమీ ఎరుగనట్లు వెంకటేష్ మా అత్తను ఎవరో ఢీకొట్టి చంపేశారని డ్రామా మొదలు పెట్టారు.
కేసు విచారణ మొదలు పెట్టిన తొగుట సీఐ లతీఫ్, ఎస్ఐ రవికాంత్ రావు లోతుగా విచారణ చేయడంతో ఈ కుట్ర బయటపడింది.. విచారణలో నిజం ఒప్పుకున్న తాళ్ల వెంకటేష్, తాళ్ల కర్ణాకర్లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు సీపీ డా బి అనురాధ తెలిపారు. కుట్ర కేసును వేగంగా చెందించిన సీఐ లతీఫ్, ఎస్ ఐ రవికాంత్ రావు, సిబ్బందిని ఆమె అభినందించారు.
Siddipet | సాగు నీటి కోసం.. ఆశగా రైతుల ఎదరుచూపులు
Army Jawan Donate | ఆర్మీ జవాన్ ఆదర్శం.. మొదటి వేతనం ఆలయానికి అందజేత
BRS | బీఆర్ఎస్ హాయంలోనే గ్రామపంచాయతీల అభివృద్ధి :ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి