Singireddy Niranjan Reddy : సిద్దిపేట జిల్లా నంగునూరు మండంలోని నర్మెటలో అయిల్ పామ్ పరిశ్రమ కేసీఆర్(KCR) ప్రభుత్వం కృషి ఫలితమేనని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Singireddy Niranjan Reddy) అన్నారు. ఒకప్పుడు ఆయిల్ పామ్ సాగును వ్యతిరేకించిన కాంగ్రెస్.. ఇప్పుడు ఆయిల్ పామ్ పాట పాడుతున్నారని ఆయన విమర్శించారు. నర్మెటలో ఆయిల్ పామ్ పరిశ్రమ ప్రారంభం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
నర్మెటలో 16 నెలల్లోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయిల్ పామ్ పరిశ్రమను పూర్తి చేసిందని గొప్పలు చెబుతున్నారి, మరి వనపర్తి జిల్లాలో ఆయిల్ పామ్ పరిశ్రమ ఎందుకు పూర్తి చేయలేదు ? అని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ విస్తరణకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం, వ్యవసాయ మంత్రిగా నా కృషి ఎంతో ముఖ్యమైనదని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఆయిల్ పామ్ సాగు అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఏమాత్రం లేదని, అసలు ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల బాధ్యత లేదని ఆయన మండిపడ్డారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన పనులకు కాంగ్రెస్ సర్కారు రిబ్బన్ కటింగులు చేస్తోందని నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు. ‘ఇక్రిశాట్’ సంస్థను ఎవరు స్థాపించారు? ఎప్పుడు స్థాపించారు? ఎక్కడ ఉంది? వంటి విషయాలేవీ తెలియని ముఖ్యమంత్రి అది అమెరికా సంస్థ అంటున్నారని ఆయన రేవంత్‌పై విరుచుకపడ్డారు. రైతు భరోసా ఎకరాకు ఏడాదికి రూ.15 వేలు అని రూ.12 వేలకు కుదించారని మాజీ మంత్రి విమర్శించారు.
కుదించిన రైతుభరోసా కూడా రెండు సార్లు ఎగ్గొట్టారని, ఇప్పుడు 73 లక్షల మందికి ఒక ఎకరాకు ఇస్తాం.. మిగిలినవి తరువాత చూద్దాం అంటున్నారని ఆయన కాంగ్రెస్ మోసాన్ని ఎండగట్టారు. ఇది గ్యారంటీ లేని ప్రభుత్వమని, ఇచ్చిన హామీలు మరిచి రైతులను వేధిస్తోందని నిరంజన్ రెడ్డి తెలిపారు. నాడు ధాన్యం కొనుగోలుకు, మోదీకి ఏం సంబంధం అన్నారని, నేడు కేంద్ర మంత్రి చెప్పారు .. ధాన్యం కొనడం కుదరదని నిస్సిగ్గుగా చెబుతున్నారనే విషయాన్ని ఆయ న గుర్తు చేశారు.