సిద్దిపేట, మార్చి 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఆధ్యర్యంలో మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఈ నెల 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని 6, 7, 8 తేదీల్లో మూడు రోజుల పాటు సంబురాలను నిర్వహించనున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలోని మహిళా నేతలు పార్టీ ఆదేశానుసారం మూడు రోజుల పాటు మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని చేపట్టడానికి అన్ని నియోజకవర్గ కేంద్రాలతో పాటు పెద్ద పట్టణాల్లో, మండల కేంద్రాల్లో ఎక్కడి వారు అక్కడ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు మహిళానేతలతో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు రెండు రోజుల కిందట టెలీకాన్ఫరెన్ నిర్వహించి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమలు చేస్తున్న పథకాలను వివరించడంతో పాటు స్థానిక లబ్ధిదారులను నేరుగా కలవాలని సూచించారు. ముఖ్యంగా కేసీఆర్ కిట్టు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఇంటింటికి మిషన్‌భగీరథ ద్వారా తాగునీరు, షీటీమ్స్ తదితర వాటిని ఈ మూడు రోజుల కార్యక్రమంలో వివరిస్తారు. పార్టీ జిల్లా అధ్యక్షులతో పాటు పార్టీ ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు.
నేడు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు రాఖీలు
మూడు రోజుల కార్యక్రమాల నిర్వహణలో భాగంగా నేడు(ఆదివారం) జిల్లాలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలు, కటౌట్లకు మహిళా నాయకులు, కార్యకర్తలు రాఖీలు కడుతారు. జిల్లాలోని పారిశుధ్య కార్మికులు, వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు, స్వయం సహాయక సభ్యులను మహిళా నేతలు సన్మానిస్తారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్ వంటి ఆకారాలతో మనవహారాలు తదితర కార్యక్రమాలు చేపట్టేలా టీఆర్ఎస్ మహిళా నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు భారీగా ఏర్పాట్లు చేసుకున్నారు. రెండోరోజూ సోమవారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్టు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి, అక్కడ మహిళా నేతలు సెల్ఫీలు తీసుకుంటారు. మహిళా దినోత్సవం రోజైన 8న మంగళవారం అన్ని నియోజకవర్గ స్థాయిలో మహిళలతో కలిసి సంబురాలు నిర్వహిస్తారు. కార్యక్రమాల ఏర్పాట్లపై స్థానిక నేతలు నిమగ్నమయ్యారు.
ఇంటికి పెద్దలా ముఖ్యమంత్రి
సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలతో ఇంటికి పెద్దలా మారారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదింటి ఆడబిడ్డ పెండ్లికి పెద్దన్నలా సీఎం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో ఆ ఇంటికి రూ. లక్షా నూట పదహార్లు అందిస్తున్నారు. ఈ పథకం ద్వారా ఎంతో మంది పేద ఆడబిడ్డల పెండ్లిలు జరిగాయి. ప్రైవేటు దవాఖానకు పోలేని వారి కోసం ప్రభుత్వ దవాఖాననే కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్ది, సేవలందిస్తున్నారు. ఇవాళ ప్రతి ఒక్కరూ సర్కారు దవాఖానకు వెళ్లి, మెరుగైన వైద్యం పొందుతున్నారు. సీఎం కేసీఆర్ కిట్టు ద్వారా ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు పెరిగాయి. తల్లీబిడ్డ క్షేమంగా ఉంటున్నారు. గతంలో తాగునీటికి అల్లాడిన పల్లెలు, తండాల మహిళలు, ఇవాళ మిషన్ భగీరథ నీళ్లను ఇంటి గుమ్మం ముందే పట్టుకుంటున్నారు. నల్లా తిప్పగానే బిందెలో నీరు పడుతుండగా, ఆ నీటిలో సీఎంకేసీఆర్ కనిపిస్తున్నారని మహిళా నేతలు అంటున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు పూర్తి భరోసానిస్తూ రక్షణగా నిలిచింది. ఇవాళ షీటీమ్స్‌ను ఏర్పాటు చేశారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తున్నారు. మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపింది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మహిళాబంధు కార్యక్రమాన్ని చేపట్టడానికి అన్ని వర్గాల ప్రజలు సమాయత్తమవుతున్నారు.
మూడు రోజులు ఉత్సవంలా..
మంత్రి కేటీఆర్ ఆదేశాలతో మూడు రోజుల పాటు మెదక్ జిల్లాలో ‘మహిళా బంధు’ కార్యక్రమాలు చేపడుతాం. 6న సంబురాలు ప్రారంభించి, సీఎం కేసీఆర్ చిత్రపటాలకు రాఖీ కడతాం. పారిశుధ్య కార్మికులు, డాక్టర్లు, ప్రతిభ కలిగిన విద్యార్థినులు, ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, స్వయం సహాయక సంఘాల నాయకులను సన్మానిస్తాం. 7న కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఇతర మహిళా సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారులను ఇండ్ల వద్దకు వెళ్లి కలుస్తాం. లబ్ధిదారులతో సెల్ఫీలు తీసుకుంటాం. 8న నియోజకవర్గ స్థాయిలో మహిళలతో సమావేశాలు, సంబురాలు నిర్వహిస్తాం. కేసీఆర్ మహిళా బంధు సంబురాలను అంబరాన్నంటేలా నిర్వహిస్తాం.
– పద్మాదేవేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే
మహిళలకు అండగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం
మహిళా సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. పుట్టే ఆడబిడ్డా నుంచి వృద్ధురాలి వరకు ఏదో రకమైన సంక్షేమ పథకం అందుతున్నది. విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో మహిళలకే అత్యధిక ప్రాధాన్యం కల్పించారు. స్థానిక సంస్థల్లో 50శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కింది. ఒంటరి మహిళ పింఛన్లు, డబుల్ బెడ్రూం ఇండ్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, బీడీ కార్మికుల పింఛన్లు ఇవన్నీ మహిళలను దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన పథకాలే. మహిళలకు గౌరవం కల్పించేందుకు నేటి నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్న ‘మహిళా బంధు’ కార్యక్రమాలను విజయవంతం చేయాలి.
మహిళా సాధికారత మన ప్రభుత్వానిదే..
దేశంలోని ఒక్కో రాష్ట్రంలో ఒక విధంగా పథకాలు అమలు చేయడం సహజం. కానీ, తెలంగాణలో మాత్రం మహిళలకు ప్రత్యేక పథకాలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుంది. సీమాంధ్ర పాలకుల మూలంగా ఆడపడుచులు మంచి నీళ్ల కోసం రోడ్లెక్కి గొడవలు పడిన సంఘటనలు కోకొల్లలు. స్వరాష్ట్రం నీటిగోస పడొద్దని భావించిన సీఎం ఇంటింటికీ నల్లా నీళ్లు అందించి మహిళలకు అండగా నిలిచారు. మహిళలు, యువతులు, ఆడబిడ్డల కోసం అనేక సంక్షేమ పథకాలు తెచ్చారు. మహిళల భద్రతకు షీటీమ్స్ ఏర్పాటు చేశారు. మహిళల కోసం ప్రత్యేకంగా పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసి 10శాతం రిజర్వేషన్లు కల్పించడం, రాజకీయాల్లో రాణించేందుకు 50శాతం రిజర్వేషన్లు కల్పించి ప్రత్యేక స్థానంతో గుర్తించిన ప్రభుత్వం తెలంగాణనే.
– చింతా ప్రభాకర్, టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు