సిద్దిపేట, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సాగరం తన గర్భంలో ఎన్నో జీవరాశులను దాచుకుంటుంది. ఎన్నో జీవులకు ఆహారాన్నిస్తుంది. తనపై ఆధారపడిన ఎన్నో కుటుంబాలను చల్లగా చూస్తుంది. కొమురవెల్లి మల్లన్నసాగర్ సైతం ఇదే కోవకు చెందుతుంది. సీఎం కేసీఆర్ ఆలోచనతో ఏర్పాటైన ‘కొమురవెల్లి మల్లన్నసాగర్ రిజర్వాయర్’ బహుళ ప్రయోజనాలు కలిగిన అతిపెద్ద రిజర్వాయర్‌గా అభివర్ణించవచ్చు. దీని నిర్మాణంతో సాగు, తాగునీటి వెతలు తీరనుండడంతో పాటు జీవజాలం, భూగర్భ జలాలు వృద్ధి చెందుతున్నాయి. పారిశ్రామిక అవసరాలకు పుష్కలంగా నీరు అందుబాటులోకి వస్తున్నది. పర్యాటకాభివృద్ధికి దోహపడుతున్నది. బంగారు పంటలు పండుతున్నాయి. రైతు ఆత్మహత్యలు తగ్గుముఖం పడుతున్నాయి. రైతుకు పరపతి పెరుగుతున్నది.
నేడు జాతికి అంకితం..
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా సిద్దిపేట జిల్లాలో నిర్మించిన కొమురవెల్లి మల్లన్నసాగర్ రిజర్వాయర్ ప్రారంభోత్సవానికి సిద్ధమమైంది. సీఎం కేసీఆర్ నేడు ప్రారంభించి, జాతికి అంకితం చేయనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. జిల్లా అధికారులతో కలిసి మంత్రి హరీశ్‌రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
అతిపెద్ద రిజర్వాయర్..
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు తర్వాత అతిపెద్ద రిజర్వాయర్‌గా మల్లన్నసాగర్. దీని కెపాసీటీ 50 టీఎంసీలు. రిజర్వాయర్‌ను 17,871 ఎకరాల భూమిని సేకరించి నిర్మించారు. ఎనిమిది గ్రామాలు పూర్తిగా, 3 గ్రామాలు పాక్షికంగా ముంపునకు గురయ్యాయి.
ఇతర జిల్లాలకూ ప్రయోజనాలు
బహుళ ప్రయోజనాలు కలిగిన ఈ జలాశయంతో ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు ఉమ్మడి నల్లగొండ, నిజామాబాద్ జిల్లాలకు ప్రయోజనం కలుగుతున్నది. కొండపోచమ్మ, గంధమల్ల, బస్వాపూర్, నిజాంసాగర్, సింగూరు, తపాస్‌పల్లి, మిషన్ భగీరథ ప్రాజెక్టులకు ఇక్కడి నుంచి గోదావరి జలాలను తరలిస్తారు. 50 టీఎంసీల్లో హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల తాగునీటి కోసం 30 టీఎంసీలు, పారిశ్రామిక అవసరాల కోసం 16 టీఎంసీల నీటిని ఏడాది పొడవునా అందిస్తారు. శ్రీరాజరాజేశ్వర జాలశయం నుంచి అన్నపూర్ణ, రంగనాయక సాగర్‌కు అక్కడి నుంచి ఓపెన్ కెనాల్, సొరంగం ద్వారా మల్లన్నసాగర్‌లోకి గోదావరి జలాలు వస్తాయి.
రాత్రింబవళ్లు సాగిన పనులు..
సిద్దిపేట జిల్లా తొగుట-కొండపాక మండలాల శివారులోని గుట్టల మధ్య మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను రికార్డు సమయంలో నిర్మించారు. బండ్పొడవు 22.6 కి.మీ. ఉం టుంది. అడుగు భాగంలో సుమారుగా 350 మీటర్ల వెడల్పుతో ప్రారంభమై, బండ్ పైభాగం వచ్చే సరికి 8 మీటర్ల వెడల్పుతో కట్టారు. బండ్ ఎత్తు 59.96 మీటర్లు ఉంటుంది. రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా రాత్రింబవళ్లు, మండుటెండల్లో అధికారులు, వర్క్ ఏజెన్సీలు, కార్మికులు నిత్యం పనులు చేసి రికార్డు సమయంలో పూర్తి చేశారు.
పర్యాటక ప్రాంతంగా అభివృద్ధికి అవకాశాలు..
రిజర్వాయర్ పక్కనే రిజర్వు ఫారెస్టు ఉంది. నల్లమల్లను తలదన్నేలా ఈ అటవీ ప్రాంతం ఉంటుంది. ఇది రాజీవ్ రహదారిని ఆనుకొని ఉంది. ఈ అటవీ ప్రాంతం 4,794.47 హెక్టార్లలో విస్తరించి ఉండగా, దీనిలో నుంచి 1,327.45 హెక్టార్ల అటవీప్రాంతం రిజర్వాయర్‌లో మునిగిపోయింది. మిగతా ప్రాం తాన్ని సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా మంచి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నారు. దీనిని ఒక మంచి పర్యాటక ప్రాంతంగా తయారు చేస్తున్నారు. కొండపాక మండలం లకుడారం నుంచి 20 కి.మీ మేర అటవీ ప్రాంతం గుండా వెళ్తే రిజర్వాయర్ బ్యాక్ వాటర్ ఈ అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉంటుంది. ఈ ప్రాంతాన్ని అటవీ పునర్జ్జీవంలో భాగంగా వివిధ రకాల మొక్కలను జిల్లా ఫారెస్టు శాఖ నేతృత్వంలో నాటారు. అటవీ ప్రాం తంలో పెత్తఎత్తున ఆయుర్వేద మొక్కలు పెంచుతున్నారు.
ప్రధానంగా కలబంద, తులసి, వెదురు, తిప్పతీగ, అల్లనేరడి, పొడపత్రి, ఫామారోజ్గడ్డి, నిమ్మగడ్డి తదితర మొక్కలు ఉన్నాయి. అటవీ పునరుద్ధ్దరణలో భాగంగా టేకు మొక్కలు, వేప, అడవినాబి తదితర మొక్కలు పెరిగాయి. మొత్తంగా మెడిసిన్‌కు సంబంధించిన మొక్కలు ఎక్కువ సంఖ్యలో ఉండేలా చూశారు. కొండపాక రిజర్వు ఫారెస్ట్ నుంచి ఆగ్నేయ మూలలో, సిరిసినగండ్ల రిజర్వు ఫారెస్ట్ వాయువ్య మూలలో, వేములఘాట్ రిజర్వు వరకు సర్వేచేసి మార్క్ చేశారు. అటవీ ప్రాంతంలో వాచ్ టవర్లు ఏర్పాటు చేయడంతో వాటి నుంచి పర్యాటకులు అటవీ ప్రాంతం అందాలతో పాటు మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను చూడవచ్చు. రాజీవ్ రహదారిపై లకుడారం వద్ద ఆకట్టుకునేలా ఎంట్రెన్స్ ప్లాజాను ఏర్పాటు చేస్తారు. దట్టమైన అటవీ ప్రాం తంలోని గుట్టల మధ్యన అంకారెడ్డి చెరువు ఉంది. ఇది అర కిలోమీటర్‌కు పైగా ఉంది. ఈ అటవీ ప్రాం తంలో సుమారుగా 150 వరకు చిన్న కుంటలు ఉన్నాయి.
ప్రాజెక్టుల నిర్మాణంతో తగ్గిన రైతు ఆత్మహత్యలు
సమైక్య ప్రభుత్వాల హయాంలో సిద్దిపేట డివిజన్లోని సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల్లో రైతు ఆత్మహత్యలు అధికంగా ఉండేవి. ప్రతి రైతు ఆత్మహత్య వెనుక ఆర్థిక ఇబ్బందులు, అప్పులు ఉండేవి. బోర్లు వేసి బొక్కబోర్ల పడేవారు. ఆనాటి ప్రభుత్వాలు రైతులను పట్టించుకోలేదు. సాగునీటి కోసం ఒక సాగునీటి ప్రాజెక్టు కట్టాలన్న ఆలోచన కూడా వారికి రాకపోవడంతో రైతు ఆర్థికంగా దెబ్బతిన్నాడు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రాజెక్టు నిర్మాణం చేసి రైతాంగానికి పుష్కలంగా సాగునీరు అందించడంతో ఇవాళ రైతుల ఆత్మహత్యలు తగ్గాయి. హాయిగా ఎవుసం చేసుకుంటూ మంచి పంటలు పండిస్తూ రైతాంగం సంతోషంగా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రిజర్వాయర్లతో ప్రతి గుంట సాగులోకి వచ్చింది. రైతుకు పరపతి పెరిగింది. భూముల ధరలు అమాంతం పెరుగడంతో రైతు కుటుంబాల దశ మారింది.
కాళేశ్వరం.. నూతనోత్తేజం..
కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతుల్లో నూతనోత్తేజం వచ్చింది. సాగునీరు లేక రైతులు ఇన్నాళ్లు అల్లాడిపోయారు. ఎక్కడో పుట్టిన గోదారమ్మను అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్ మీదుగా ఎంతో ఎత్తులో ఉన్న కొండపోచమ్మ వరకు నీళ్లు తీసుకొచ్చిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్. రైతు సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ తమకు దేవుడని రైతులకు అంటున్నారు. రైతుబంధు, రైతుబీమా తదితర పథకాలను ప్రవేశపెట్టి రైతాంగానికి సీఎం కేసీఆర్ వెన్నుదన్నుగా నిలిచారు. నీళ్లు లేక పడావున్న భూముల్లో సిరుల పంటలు పండిస్తున్నారు. రెండు మూడేండ్లుగా భూమికి బరువయ్యేలా పంటలు పం డుతున్నాయి. ఇన్నాళ్లు నీళ్లు లేక పడావు పెట్టి బతుకు కోసం వలసపోయిన రైతులు కాళేశ్వరం జలాలు రావడంతో రైతులంతా సొం తూళ్లకు చేరుకొని చేతినిండా పనిచేసుకుంటున్నారు. గోదావరి జలాలు చూసి సంబురంలో తేలియాడుతున్నారు. కాల్వల ద్వారా సాగు చేయడంతో మంచి పంటలు పండుతున్నాయి. గ్రామాల్లోని నిరుద్యోగ యువతకు చేతినిండా పని దొరికింది. సమై క్య రాష్ట్రంలో భూములు ఉన్నప్పటికీ నీళ్లు లేక యువత ఖాళీగా ఉండేవారు. ఇవాళ గోదావరి జలాలు రావడంతో యువత వారికున్న టెక్నాలజీతో వ్యవసాయాన్ని వినూత్నంగా చేపడుతున్నారు. పల్లె ప్రజలకు చేతినిండా పనిఉండడంతో పల్లెలు ప్రశాంత వాతావరణంలో జీవనం కొనసాగిస్తున్నాయి.