సిద్దిపేట, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సీఎం కేసీఆర్ భగీరథ ప్రయత్నంతో నెర్రెలు బారిన నేలల్లో గోదారమ్మ పరవళ్లు తొక్కుతున్నది. నాడు సాగు నీటి కోసం అరిగోసపడ్డ రైతుకు స్వరాష్ట్రంలో భరోసా కలిగింది. సమైక్య పాలనలో కనీసం ఒక్క ప్రాజెక్టు నిర్మించకపోవడంతో రైతు సాగుకు కష్టమైంది. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ వల్లే గోదారమ్మ గలగల పారుతూ బీళ్లను తడిపింది. ఎక్కడో పుట్టిన గంగమ్మ 618 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపోచమ్మ ఒడికి చేరింది. గోదావరి జలాలు రాజన్నసిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర రిజర్వాయర్ (మిడ్‌మానేరు) నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్ ద్వారా సిద్దిపేట జిల్లాలోని రంగనాయక, కొండపోచమ్మ రిజర్వాయర్లకు గోదారమ్మ వస్తున్నది. మేడిగడ్డ నుంచి తరలివచ్చి పలు ప్రాజెక్టులకు జీవం పోసింది. ఇవాళ రంగనాయకసాగర్ కుడి, ఎడమ కాల్వల ద్వారా సిద్దిపేటలో 1.10 లక్షల ఎకరాల ఆయకట్టు సాగునీరు అందుతున్నది.
రెండేండ్లుగా సిద్దిపేట జిల్లాలోని పలు చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు నిండుతున్నాయి. గతేడాది మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లో భాగంగా నిర్మించిన తుక్కాపూర్ పంప్‌హౌస్ నుంచి ప్రధాన కెనాల్ ద్వారా గజ్వేల్ మండలం అక్కారం, మర్కూక్ పంప్‌హౌస్ ద్వారా కొండపోచమ్మకు నీళ్లు తరలించారు. (గతేడాది కొడకండ్ల వద్ద ఉన్న ప్రధాన కెనాల్ నుంచి ప్రస్తుతం కూడవెళ్లి వాగులోకి నీటిని విడుదల చేశారు). దీంతో కూడవెల్లి వాగుకు నీటిని విడుదల చేయడంతో సిద్దిపేట జిల్లాలో సుమారు 54 కి.మీ. దూరం ఉన్న వాగుపై 39 చెక్‌డ్యాంలు నిండుకొని రాజన్నసిరిసిల్ల జిల్లాలోని నర్మాల చెరువులోకి గోదావరి జలాలు తరలివెళ్లాయి. కొమురవెల్లి మల్లన్నసాగర్ 536 ఎఫ్‌ఆర్‌ఎల్‌లో ఉండే కీలకమైన రిజర్వాయర్ పూర్తి కాగా, నేడు ముఖ్యమంత్రి పనులు ప్రారంభించి, ప్రజలకు అంకితం చేయనున్నారు.
గతేడాదిలో హల్దీవాగు నుంచి నిజాంసాగర్‌కు ( 96కి.మీ)
సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ మండలం తున్కిఖల్సా తపాస్ఖాన్ చెరువు వద్ద పుట్టింది హల్దీవాగు. అక్కడి నుంచి ప్రారంభమైన వాగు నాచగిరి లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం నుంచి మెదక్ జిల్లాలోకి హల్దీవాగు ప్రవహిస్తుంది. తూప్రాన్, మాసాయిపేట, వెల్దుర్తి మండలాల మీదుగా పాపన్నపేట మండలం ఏడుపాయల వద్ద మంజీరాలో కలుస్తుంది. అక్కడి నుంచి నిజాంసాగర్‌లోకి వెళ్తుంది. హల్దీవాగు నుంచి నిజాంసాగర్ వరకు (ఉమ్మడి నిజామాబాద్ జిల్లా) సుమారు 96 కి.మీటర్లు ఉంటుంది. ఈ వాగులోకి గతేడాది ఏప్రిల్‌లో కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి సంగారెడ్డి కెనాల్ ద్వారా సీఎం కేసీఆర్ గోదావరి జలాలను విడుదల చేశారు. సంగారెడ్డి కెనాల్ నుంచి హల్దీవాగు మధ్య 6 కి.మీ. దూరం ఉంటుంది. హల్దీవాగు ప్రారంభం నుంచి మంజీరా వరకు 70కి.మీ. ఉంటుంది. మెదక్ జిల్లాలోని మంజీరా నుంచి 20 కి.మీ దూరంలో ఉన్న నిజాంసాగర్ ప్రాజెక్టులోకి గోదావరి జలాలు పరుగులు పెట్టాయి. హల్దీవాగుపై మొత్తం 32 చెక్‌డ్యాంలు, ఈ చెక్‌డ్యాంల నీటి కెపాసిటీ 0.621 టీఎంసీలు.