దుబ్బాక, ఫిబ్రవరి 20 : సీఎం కేసీఆర్‌కు .. విద్యాబుద్ధ్దులు నేర్పిన గురువులు, చదువుకున్న బడి అన్నా అమితమైన ప్రేమ, గౌరవం తాను సీఎం స్థాయికి ఎదగడానికి కారణం విద్య నేర్పిన గురువులు, చదువుకున్న దుబ్బాక బడి పరిసరాలే కారణమని పలు సందర్భాల్లో ప్రస్తావించారు. దుబ్బాక ప్రభుత్వ పాఠశాలలో కేసీఆర్ 4వ తరగతి నుంచి 9వ తరగతి వరకు (1964-1969) విద్యాభ్యాసం చేశారు. ఆనాడు విద్యాబుద్ధ్దులు నేర్చుకున్న ‘చదువులమ్మ బడి’ రుణం తీర్చుకునేందుకు రూ.11 కోట్లు మంజూరు చేశారు. మొదట రూ. 6 కోట్లు మంజూరు చేయగా, పాఠశాల, కళాశాల భవనం ఒకే చోట నిర్మించేందుకు దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ప్రత్యేక చొరవతో.. భవనానికి రూ.11 కోట్లు మంజూరు చేశారు. పాఠశాల భవనాన్ని డబ్బాల మాదిరిగా కాకుండా .. ఆధునాతన హంగులతో .. ఓ ఇంధ్ర భవనంలా నిర్మింపజేశారు. రోమ్ శిల్పకళా నమూనాలో మూడంతస్తుల భవవనాన్ని నిర్మించారు. ఈ బడి ఓ రాజ్మహాల్గా ఉండటం మరీ విశేషం. సీఎం కేసీఆర్ బడి దుబ్బాక అభివృద్ధిలో ఓ మణిహారంగా మారింది. బడి భవనం నిర్మాణ పనులు పూర్తికావడంతో త్వరలోనే సీఎం కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభానికి సిద్ధంగా ఉన్నది.
దుబ్బాకలో నాడు సీఎం కేసీఆర్ చదువుకున్న బడి శిథిలావస్థకు చేరిన విషయం తెలుసుకొని, నూతన భవనానికి భారీగా నిధులు మంజూరు చేశారు. దీంతో పురాతన బడిని కూల్చేసి.. ఆదే స్థలంలో (సుమారు రెండేకరాల స్థలంలో) సుందరమైన పాఠశాల భవనాన్ని నిర్మించారు. పాఠశాలతో పాటు కళాశాల ఒకేచోట ఉండేందుకు భవనాన్ని ఆధునాతన హంగులతో నిర్మించారు. పాఠశాలకు సంబంధించిన విభాగంలో 4-ప్రయోగశాల గదులు, ఒక లైబ్రరీ గది, ఆర్ట్స్ గది, కామన్ గది, కంప్యూటర్, స్టోర్ రూం, ప్రధానోపాధాయుడి గదితో పాటు సిబ్బంది విశ్రాంత గదులను నిర్మించారు. కళాశాల విభాగంలో 14 గదులు, 6-ల్యాబ్ గదులు, గ్రంథాలయం, కంప్యూటర్ , స్టోర్ రూం, ప్రిన్సిపల్ గది, మరో రెండు సిబ్బంది గదులతో మొత్తం 50 విశాలమైన గదులను నిర్మించారు. అంతేగాక పాఠశాల ప్రాంగణంలో.. పలు క్రీడా మైదానాలకు కావల్సిన వసతులు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ప్రాథమిక విద్య నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకునే అవకాశం కల్పించనున్నారు. పాఠశాల భవన నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పర్యవేక్షించారు.
సీఎం కేసీఆర్ బడి ఓ మణిహారం
దుబ్బాక పట్టణాభివృద్ధిలో కేసీఆర్ బడి ఓ మణిహారంగా మారనున్నది. సర్కారు బడుల్లో జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే దుబ్బాక కేసీఆర్ బడి ప్రత్యేకత నెలకొంది. దుబ్బాక -చెల్లాపూర్ రోడ్డులో ఎస్సీ, బీసీ కాలనీల మధ్య నిర్మించిన కేసీఆర్ బడి కనువిందుగా మారింది. బడికి కొద్ది దూరంలోనే బల్వంతాపూర్ రోడ్డులో డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయం ఆకర్షణీయంగా మారాయి. కేసీఆర్ బడి నిర్మాణపనులు పూర్తి కావడంతో దుబ్బాక, చుట్టూ పక్కల ప్రాంతాల విద్యార్థులు ఈ బడిలో చదువుకునేందుకు ప్రత్యేక ఆసక్తి కనబర్చుతున్నారు. ఈ పాఠశాల భవనం ముందు ఏపుగా పెరిగినా వేప చెట్లు ఆహ్లాదకరంగా..ఆకర్షణీయంగా ఉన్నాయి. నాడు విద్యార్థిగా ఉన్న సమయంలో సీఎం కేసీఆర్ నాటిన వేప మొక్కలే.. ఇప్పుడు నీడనిచ్చే వృక్షాలుగా మారాయని ఆయన బాల్యమిత్రులు గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పటికీ పాఠశాల ముందు ఆయన నాటిన రెండు వేప చెట్లు అలాగే ఉన్నాయి. వాటిని తొలగించకుండానే పాఠశాల భవనం నిర్మించడం విశేషం.
స్వపరిపాలన దినోత్సవంలో ..
దుబ్బాక ప్రభుత్వ పాఠశాలలో 1967 లో స్వపరిపాలన దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ సమయంలో హెచ్ఎస్సీ విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించారు. 7వ తరగతిలో ఉన్న కేసీఆర్ పాల్గొన్నారు. స్వపరిపాలన దినోత్సవంలో కేసీఆర్ తన సీనియర్లతో దిగిన ఫొటోలను ఆయన మిత్రులు పదిలంగా కాపాడుకున్నారు. ఆనాటి జ్ఞాపకాలను ఆయన మిత్రులు తరుచూ గుర్తు చేసుకుంటారు. పాఠశాలలో లీడర్‌గా వ్యవహరించిన కేసీఆర్ .. నేడు తెలంగాణ రాష్ట్ర సాధనతో పాటు సీఎంగా ఉండటం తమకు గర్వకారణమని చెబుతుంటారు.
కేసీఆర్ బడి శాశ్వతంగా గుర్తుండిపోతుంది..
సీఎం కేసీఆర్ విద్య నేర్చుకున్న బడి శాశ్వతంగా గుర్తుండిపోయేలా నిర్మాణం చేపట్టారు. ఆయనకు విద్య నేర్పిన గురువులపై, చదువుకున్న బడి అన్నా ఎంతో అభిమానం. దుబ్బాకలో రూ.11 కోట్లు వెచ్చించి సకలహంగులతో కేసీఆర్ బడి నిర్మించడం చాలా సంతోషంగా ఉన్నది. ఈ పాఠశాల దుబ్బాకకే కాకుండా జిల్లాలోని విద్యార్థులకు ఓ వరంగా మారిందని చెప్పోచ్చు. పాఠశాలతో పాటు కళాశాల విద్య ఒకే చోట ఉండటం శుభపరిణామం. భవన నిర్మాణ పనులు పూర్తికావడంతో.. త్వరలోనే సీఎం చేతులమీదుగా ప్రారంభించి, వినియోగంలోకి తీసుకువస్తాం.
– కొత్త ప్రభాకర్‌రెడ్డి , మెదక్ ఎంపీ
సీఎంగా ఎదిగినా.. ఒదిగి ఉండటం కేసీఆర్‌కే సాధ్యం..
కేసీఆర్ ముఖ్యమంత్రి ఎత్తుకు ఎదిగినప్పటికీ ..విద్యార్థిగానే ఒదిగి ఉండటం ఆయనకే సాధ్యం. చదువు నేర్పిన గురువులను, దుబ్బాక బడిని గుర్తుంచుకోవడంపై..నేనొక మిత్రుడిగా గర్వపడుతున్నా. కేసీఆర్ చదువుకున్న బడి శిథిలావస్థకు చేరిన విషయం తెలుసుకొని రూ.11 కోట్లు మంజూరు చేశారు. పాఠశాలతో పాటు కళాశాలను ఒకే చోట ఏర్పాటు చేయడం విద్యార్థులకు మంచి అవకాశం దక్కింది. దుబ్బాకలో కేసీఆర్ బడి ..ఓ రాజ్మహాల్గా నిర్మించినందుకు మాటాల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది.
– రొట్టే రాజమౌళి, సీఎం కేసీఆర్ బాల్యమిత్రుడు
అదృష్టంగా భావిస్తున్నా..
నేను ఈ పాఠశాలలో విద్యార్థిగా చదివి ఇక్కడ ఉపాధ్యాయుడిగా విద్యార్థులకు చదువు చెప్పే అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉన్నది. సీఎం కేసీఆర్ బడిలో నేనొక విద్యార్థిగా విద్యనభ్యసించి ఉపాధ్యాయుడిగా పని చేయడం అదృష్టంగా భావిస్తున్నా. దుబ్బాకలో కేసీఆర్ బడి ఇంతా అద్భుతంగా నిర్మించడం ఆనందంగా ఉంది. ఇందులో భావి తరాలకు మెరుగైన విద్యావసతులు కల్పించే అవకాశముంటుంది.
– గాజుల రామచంద్రం, ఉపాధ్యాయుడు