సిద్దిపేట, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఒకప్పుడు కరువుతో అల్లాడిన ఉమ్మడి మెదక్ జిల్లా నేడు పచ్చని పంటపొలాలతో కళకళలాడుతున్నది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎంగా పగ్గాలు చేపట్టిన కేసీఆర్ సాగునీటి రంగానికి పెద్దపీట వేశారు. ఇందులో భాగంగా రూ. వేల కోట్లతో రిజర్వాయర్లు, సాగునీటి కాల్వలను నిర్మించారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులతో లక్షలాది ఎకరాలకు సాగునీరందుతున్నది. సిద్దిపేట జిల్లాలో అన్నపూర్ణ, రంగనాయక, మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్లు పూర్తవగా, మెదక్ జిల్లాలో వనదుర్గా (ఘనపురం), హల్దీ ప్రాజెక్టులను ప్రభుత్వం అభివృద్ధి చేసింది. మల్లన్నసాగర్ ద్వారా గోదావరి జలాలను విడుదల చేయడంతో జిల్లాలో భూగర్భ జలాలు పెరిగి, ప్రతి గుంట సాగులోకి వస్తున్నది. దీంతో, సాగుభూముల ధరలు ఆకాశాన్నంటాయి. రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రత్యేక కృషితో ఉమ్మడి జిల్లాలో వ్యవసాయరంగం మునుపెన్నడూ లేనివిధంగా అభివృద్ధి సాధిస్తున్నది. ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేసే సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టులకు ఈనెల 21న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే, బహుళ ప్రయోజనాలు కలిగిన కొమురవెల్లి మల్లన్న సాగర్ రిజర్వాయర్‌ను ఈనెల 23న సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేయనున్నారు. దీంతో. ఉమ్మడి మెదక్ జిల్లా రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
సమైక్య రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు…
ఉమ్మడి రాష్ట్రంలో మెదక్ జిల్లా రైతు ఆత్మహత్యలకు కేరాఫ్‌గా ఉండేది. అప్పట్లో రైతులకు అన్నీ కష్టాలే. పంట చేతికొచ్చే వరకు రైతుకు ఆశలు ఉండేవి కావు. బోరుబావులు, వర్షాధారంపై సాగు చేసేవారు. వచ్చిపోయే కరెంట్, కాలిపోయే మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లతో రైతుకు పెట్టుబడి తడిసిమోపెడయ్యేది. పంట చేతికందే సమయానికి నీరందక బోరు బావులను తవ్వేవారు. ఒక్కో రైతు 500 ఫీట్లకు పైగా బోరు తవ్వించినా చుక్క నీరు రాక అప్పులపాలై బాధతో ఆత్మహత్యలకు పాల్పడేవారు. గత ప్రభుత్వాల హయాంలో సిద్దిపేట డివిజన్లోని సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల్లో రైతు ఆత్మహత్యలు అధికంగా ఉండేవి. సాగునీటి కోసం ఒక్క ప్రాజెక్టునైనా కట్టాలన్న ఆలోచన వారికి రాకపోవడంతో రైతులు ఆర్థికంగా దెబ్బతిన్నారు. అయితే, తెలంగాణ ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ తానే స్వయంగా ప్రాజెక్టులకు రూపకల్పన చేసి పూర్తిచేయించారు. ఫలితంగా వ్యవసాయానికి పుష్కలంగా సాగునీరు అందుతున్నది. రైతులు రికార్డు స్థాయిలో పంటలు పండిస్తూ ఔరా అనిపిస్తున్నారు. రైతుబంధు, రైతు బీమా, నాణ్యమైన 24గంటల ఉచిత విద్యుత్ సరఫరా ఇలా అన్ని విధాలుగా ప్రభుత్వం చేయూతనిస్తుండడంతో వ్యవసాయం పండుగలా మారింది.
పాలకులకు సంకల్పం ఉంటే అద్భుతాలు …
సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి మెదక్ జిల్లా తీవ్ర వివక్షకు గురికాగా, స్వరాష్ట్రంలో మహర్దశ వచ్చింది. సీఎం కేసీఆర్ భగీరథ ప్రయత్నంతో దశాబ్దాలుగా కలగా మిగిలిన ప్రాజెక్టులు సాకారమయ్యాయి, ఎడారిగా మారిన మెతుకుసీమలో సిరులు పండుతున్నాయి. భూమికి బరువయ్యేలా పంటలు పండుతున్నాయి. పాలకులకు సంకల్పం ఉంటే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో సిద్దిపేట జిల్లాలో నిర్మించిన రిజర్వాయర్లే ఉదాహరణ. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో సుమారు 8లక్షల ఎకరాలకుపైగా సాగునీరందించేలా ప్రభుత్వం పనులు చేపట్టింది. ఉమ్మడి మెదక్ జిల్లాను సస్యశ్యామలం చేసే గోదావరి జలాలు మిడ్‌మానేరు నుంచి రానున్నాయి. మేడిగడ్డ నుంచి తరలించిన జలాలు పలు ప్రాజెక్టులకు జీవం పోస్తూ చివరగా సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ సాగర్‌కు 2020 ఏప్రిల్, మే నెలలో చేరాయి. ఈ క్రమంలో ఈ నెల 23న సీఎం కేసీఆర్ మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను జాతికి అంకితం చేయనున్నారు. స్వరాష్ట్రంలో మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధ్దరించడంతో గత వేసవిలో గోదావరి జలాలతో చెరువులు నిండుకుండలను తలపించాయి. కూడవెల్లి వాగు, హల్దీవాగులతో పాటు వనదుర్గా ప్రాజెక్టులను ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ఫలితంగా సాగు విస్తీర్ణం పెరిగింది. వీటితో పాటు సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్, ఆందోల్, నారాయణ్‌ఖేడ్, సంగారెడ్డి నియోజకవర్గాలను సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్ సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. 3.90 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో రూ.4427 కోట్లతో వీటిని నిర్మించనున్నారు. ఈ రెండు ఎత్తిపోతల పనులకు ఈనెల 21న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో రైతులోకం హర్షం వ్యక్తం చేస్తున్నది.