పచ్చదనంతో ఆహ్లాదకర వాతావరణం.. డిజిటల్ క్లాస్ రూమ్.. టై, బెల్టులు, ఐడీ కార్డులు, కిచెన్ గార్డెన్, విద్యార్థుల ఫొటోలతో క్యాలెండర్లు.. ఇలా ప్రైవేటుకు దీటుగా అన్ని సౌకర్యాలు సమకూర్చి ఇంగ్లిష్ మీడియంలో పాఠాలు బోధిస్తుండడంతో నాంచార్పల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్య యేటా పెరుగుతున్నది. మూడేండ్ల క్రితం ఇక్కడ 100 మంది కంటే తక్కువ విద్యార్థులుంటే, ఇప్పుడు 170కి చేరారు. సర్పంచ్, ఎంపీటీసీ, పంచాయతీ కార్యదర్శి సైతం తమ పిల్లలను ఈ పాఠశాలకు పంపిస్తూ పరిసర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ‘మన ఊరు- మనబడి’ కార్యక్రమంతో పాఠశాల మరింత అభివృద్ధి చెందడంతో పాటు పేద విద్యార్థులకు నాణ్యమైన ఇంగ్లిష్ మీడియం విద్య ఉచితంగా అందుతుందని పలువురు పేర్కొంటున్నారు.
సిద్దిపేట అర్బన్, ఫిబ్రవరి 18 : గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందినప్పుడే విద్యాభివృద్ధిలో రాష్ట్రం పురోగతి సాధిస్తుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలంటే మౌలిక వసతులు, సమష్టి కృషి అవసరమని గుర్తించిన ఉపాధ్యాయులు పాఠశాలల్లో అన్ని వసతులను సమకూర్చుతున్నారు. దాతల సహకారంతో పాటు స్వయంగా కొన్ని నిధులను సమీకరించి అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రభుత్వ పాఠశాల అయినప్పటికీ కార్పొరేట్ తరహాలో వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ అధికారుల మెప్పు పొందుతూ తల్లిదండ్రులకు కొండంత భరోసా ఇస్తున్నారు. ఉపాధ్యాయులపై నమ్మకంతో ఆ ఊళ్లోని విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ చిన్నారులను ప్రైవేటుకు పంపకుండా ప్రాథమికోన్నత పాఠశాలకే పంపిస్తున్నారు. అలాగే, మధ్యాహ్నం భోజనంలో విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించేందుకు కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసి సేంద్రియ పద్ధతిలో కూరగాయలు, ఆకుకూరలు పండిస్తూ వాటినే వండి వడ్డిస్తున్నారు. దీంతో ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
విద్యార్థులంతా సర్కారు బడికే..
సిద్దిపేట అర్బన్ మండలం నాంచార్పల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో మూడేండ్ల క్రితం నర్సరీ నుంచి 7వ తరగతి వరకు విద్యార్థుల సంఖ్య 100 కంటే తక్కువగా ఉండగా, నేడు 170 మంది చదువుతున్నారు. వీరిలో 150 మంది విద్యార్థులు ఆరో తరగతి వరకు ఇంగ్లిష్ మాధ్యమంలో విద్యనభ్యసిస్తున్నారు. గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, పంచాయతీ కార్యదర్శి సైతం తమ పిల్లలను ప్రైవేటులో చేర్పించకుండా ఈ పాఠశాలకు పంపిస్తున్నారు. గ్రామానికి చెందిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా పాఠశాల అభివృద్ధికి చేయూతనిస్తూ అండగా నిలుస్తున్నారు. దీంతో, ప్రైవేటు కంటే మెరుగైన మౌలిక వసతులను సమకూరుస్తూ నాణ్యమైన విద్యను అందిస్తున్నారు ఉపాధ్యాయులు. విశాలమైన, ఆహ్లాదకరమైన పచ్చని ప్రాంగణంతో పాటు డిజిటల్ క్లాస్ రూమ్, దాతల సహకారంతో టై, బెల్టులు, ఐడీ కార్డులు, విద్యార్థుల ఫొటోలతో క్యాలెండర్లు, సరస్వతీ విగ్రహం, బాల వికాస సంస్థ సహకారంతో ఫుట్ ఆపరేటెడ్ హ్యాండ్ వాష్ స్టేషన్, చెత్త బాక్సులు, శానిటైజర్ యంత్రం ఏర్పాటు చేసుకున్నారు.
19 రకాలతో కిచెన్ గార్డెన్..
వివిధ రసాయనాలతో పండించిన కూరగాయలు తినడం ద్వారా విద్యార్థులు అనారోగ్యానికి గురవుతారని, మధ్యాహ్న భోజన నిర్వాహకులకు కూడా కూరగాయల కొనుగోలులో ఇబ్బందులు వస్తున్నాయని గ్రహించిన ఉపాధ్యాయులు వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. సుమారు 19 రకాల ఆకుకూరలు, కూరగాయలను సేంద్రియ పద్ధతిలో పాఠశాల ఖాళీ స్థలంలో పండిస్తున్నారు. పదిమంది విద్యార్థులతో ఓ కమిటీని ఏర్పాటు చేసి మొక్కలను సంరక్షిస్తున్నారు. గ్రామ ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శి సహాయంతో పాఠశాలలో ఉన్న భూమిని చదును చేసి కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేశారు. రెండు నెలల క్రితం సాగు చేసిన ఆకు కూరలు, కూరగాయలను నేడు విద్యార్థుల మధ్యాహ్న భోజనంలో వండి పెడుతున్నారు. అలాగే, పంచాయతీ పరిధిలో సేకరించిన చెత్తతో కంపోస్టు యార్డులో వర్మీ కంపోస్టును తయారు చేసి కూరగాయలకు వినియోగిస్తున్నారు.
మా ఇద్దరు పిల్లలు ఇక్కడే చదువుతరు..
నా ఇద్దరు పిల్లలు మధుశ్రీ, చందన ఈ పాఠశాలలోనే ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్నరు. మాకు ఫీజుల బాధలు లేవు. ప్రతి ఒక్కరికీ లాభం జరగాలనే మా గ్రామంలో పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపించొద్దని తీర్మానం చేసుకున్నాం. ఈ పాఠశాలనే అన్ని విధాలా అభివృద్ధి చేసుకున్నం. ప్రభుత్వం ‘మన ఊరు మన బడి’కి శ్రీకారం చుట్టడం చాలా సంతోషం. ఈ కార్యక్రమంతో ఎంతో మంది పేద పిల్లలు, తల్లిదండ్రులకు ప్రభుత్వం భరోసా ఇస్తున్నది.
– పి. లత, ఎస్ఎంసీ చైర్మన్, నాంచార్పల్లి పాఠశాల
వినూత్న కార్యక్రమాలతో విద్యార్థులకు ప్రోత్సాహం
విద్యార్థులను అన్ని రంగాల్లో ప్రోత్సహించేందుకు నాంచార్పల్లి పాఠశాల ఉపాధ్యాయులు ప్రత్యేక యోగా తరగతులు నిర్వహిస్తున్నారు. వివిధ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో పలు అవార్డులు సాధించారు. అంతేకాకుండా విద్యార్థులకు సులువుగా అర్థమవడానికి దాతల సహకారంతో డిజిటల్ తరగతులను నిర్వహిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల తరహాలో ప్రతి సంవత్సరం విద్యార్థుల ఫొటోలతో క్యాలెండర్లు ముద్రించి అందిస్తున్నారు. ఏ విద్యార్థి పుట్టిన రోజు జరిగినా ఒక మొక్కను నాటడం ఆనవాయితీగా పాటిస్తున్నారు. ఇలా, అనేక వినూత్న, ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ అన్ని రంగాల్లో విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు.
అద్భుతమైన ఆలోచన..
ప్రభుత్వం అమలుచేస్తున్న ‘మన ఊరు మన బడి’ చాలా అద్భుతమైన కార్యక్రమం. ఒక ప్రభుత్వ పాఠశాలలో అన్ని మౌలిక వసతులు ఉంటే ఎలా ఉంటుందో మా పాఠశాలే ప్రత్యక్ష ఉదాహరణ. ప్రభుత్వ నిర్ణయం చాలా గొప్పది. విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శి ప్రోత్సాహంతోనే అన్ని రకాల సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. దీంతో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. విద్యార్థుల ఫౌండేషన్ సరిగా ఉంటేనే భవిష్యత్లో అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు.
– సీహెచ్ రవి, ఉపాధ్యాయుడు, నాంచార్పల్లి ప్రాథమికోన్నత పాఠశాల
పేద విద్యార్థులకు వరం..
ప్రైవేటు పాఠశాలలకు పంపలేని ఎంతో మంది తల్లిదండ్రుల కల ‘మన ఊరు మన బడి’ కార్యక్రమం ద్వారా నెరవేరుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పించి, ఇంగ్లిష్ మీడియంలో బోధించడం ద్వారా తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలకు పంపించాలనే ఆలోచన ఏ తల్లితండ్రులకు రాదు. కావాల్సిన వసతులన్నీ ఏర్పాటు చేసుకున్న తరువాత పాఠశాల అన్ని విషయాల్లో ముందంజలో ఉంది.
– పి. మల్లికార్జున్రెడ్డి, ఉపాధ్యాయుడు
ఇంగ్లిష్ మీడియంలో చెబుతున్నారనే..
మా పాఠశాల ఇంగ్లిష్ మీడియం అయినందునే ఇక్కడ చదువుతున్నా. గ్రామంలో ఏ ఒక్క విద్యార్థి కూడా ప్రైవేటు పాఠశాలకు వెళ్లడు. ఏ పని చేసినా మా ఉపాధ్యాయులు మమ్మల్ని బాగా ప్రోత్సహిస్తారు. వారు ఇచ్చే సలహాలు, సూచనలతోనే మేము క్రమశిక్షణతో ఉండి శ్రద్ధగా తరగతులు వింటాం. మాలో ఎవరి పుట్టిన రోజైనా ఒక మొక్క నాటుతాం. వాటికి మేమే నీళ్లు పోస్తాం. ఈ పాఠశాలలో చదువుకోవడం నిజంగా ఎంతో ఆనందంగా ఉంది.
– ఎ.మైత్రి, ఐదో తరగతి
ఇంగ్లిష్ మీడియంలో చదవాలని..
నేను ఏడో తరగతి చదువుతున్న. నేను చేరిన సంవత్సరం తర్వాత నుంచి మా పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం ప్రారంభమైంది. ఎవరిని చూసినా ఇంగ్లిష్లో మాట్లాడుకుంటుంటే మాకు కూడా ఇంగ్లిష్లో మాట్లాడాలని అనిపిస్తుంది. ఇప్పటికైనా మాలాంటి వాళ్ల కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అమలు చేయడం మంచి విషయం. చాలా మంది ఇక్కడి ప్రభుత్వ పాఠశాలకే వస్తారు.
-ఎస్. ప్రసన్నాంజన్, ఏడో తరగతి