సిద్దిపేట(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/దుబ్బాక, ఫిబ్రవరి 18 : ‘సిద్దిపేట జిల్లాలో టీఆర్ఎస్ పారీ ్ట శ్రేణులందరితో మమేకమై, పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతా.. పార్టీ అధిష్టానం, కార్యకర్తలకు వారధిగా ఉంటూ పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా.. గడపగడపకూ అభివృద్ధి, సంక్షేమ ఫలాలను తీసుకెళ్తా’.. అని టీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ‘తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. ఉద్యమ పురిటిగడ్డ.. సీఎం కేసీఆర్ సొంత జిల్లా.. మంత్రి హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతమిది’.. అని అన్నారు. పార్టీ శ్రేణులతో నిత్యం అందుబాటులో ఉంటూ.. వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటానని చెప్పారు. పార్టీలో సీనియర్లకు గౌరవం కల్పించి, వారి అనుభవాలను ఆచరణలోకి తీసుకొస్తామన్నారు. పార్టీ క్రమ శిక్షణకు మారుపేరుగా ఉంది. పార్టీలో కొత్త రక్తం తీసుకొస్తామన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు మరింత అవగాహన కల్పిస్తామని చెప్పారు. బీజేపీ ఝూఠా పార్టీ అని ప్రజలకు అర్థమైందన్నారు. గత దుబ్బాక ఎన్నికల్లో తప్పుడు (గోబెల్స్) ప్రచారంతో పాటు చేతల్లో చేయలేని ఎన్నో హామీలిచ్చి ప్రజలను మోసగించారన్నారు. వారి నిజస్వరూపాన్ని తెలుసుకొని ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ నామమాత్రమేనని, భవిష్యత్‌లో ఆ పార్టీల మనుగడ కష్టమన్నారు. జిల్లాలో పార్టీ మరింత బలోపేతానికి సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జిల్లా మంత్రి హరీశ్‌రావు సహకారంతో ముందుకెళ్తామన్నారు. శుక్రవారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే..
టీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా ఎలా ముందుకెళ్లాలనుకుంటున్నారు?
నాపై నమ్మకంతో టీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టిన సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీశ్‌రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు. అధ్యక్ష పదవి బాధ్యతలను పక్కాగా నిర్వహిస్తా. పార్టీ శ్రేణులతో మమేకమై, పార్టీని మరింత బలోపేతం చేస్తా. సీఎం కేసీఆర్ గారు నాకు రెండు సార్లు మెదక్ ఎంపీగా అవకాశం కల్పించారు. నాపై నమ్మకంతో జిల్లా అధ్యక్ష పదవిని అప్పగించారు. ఈ పదవికి మరింత వన్నే తెచ్చేందుకు నా వంతుగా కృషి చేస్తా. పార్టీ అధిష్టానానికి, కార్యకర్తలకు, నాయకులకు వారధిగా ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా. పార్టీ శ్రేణులకు ఎలాంటి సమస్యలున్నా సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేల సహకారంతో పరిష్కారానికి కృషి చేస్తా.
పార్టీ బలోపేతానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు?
టీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకులతో పాటు కార్యకర్తలందరితో మమకమై, వారికి అండగా ఉంటా. సీనియర్ల అనుభావాలతో యువతకు ప్రాధాన్యం కల్పించి, పార్టీలో కొత్త రక్తం తీసుకొవస్తాం. పార్టీల వార్డు, గ్రామ, మండల, జిల్లా కమిటీలతో సమావేశాలు నిర్వహిస్తాం. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో పాటు కార్యకర్తలు చాలా చురుకుగా ఉన్నారు. జిల్లా అధ్యక్షుడిగా అందరిని సమన్వయం చేసుకొని పార్టీని మరింత బలోపేతం చేస్తాం. పార్టీలో యువతతో పాటు మహిళలకు సముచిత స్థానం కల్పించి పార్టీ అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి సారిస్తా. విద్యార్థి, యువజన విభాగాలను పటిష్ఠ పరిచి అవసరమైతే రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తాం. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం తీసుకవస్తా. జిల్లాలో టీఆర్ఎస్ తప్పా, ఇతర పార్టీల ఉనికి లేకుం డా చేస్తాం.
జిల్లాలో ప్రతిపక్షాల పరిస్థితి ఎలా ఉంది?
జిల్లాలో ప్రతిపక్షాలకు ప్రజాదరణ లేదు. బీజేపీ, కాంగ్రెస్ కేవలం నామమాత్రంగా ఉన్నాయి. గత దుబ్బాక ఉప ఎన్నికల్లో అతి తక్కువ మెజార్టీతో గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేను ప్రస్తుతం నియోజకవర్గ ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఉప ఎన్నికల్లో నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి, రైతులకు జోడు ఎడ్లు, నాగలి, దుబ్బాకకు రైలు తీసుకొస్తామంటూ ఆచరణ సాధ్యం కానీ ఎన్నో హామీలిచ్చి గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే వైఖరిపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. బీజేపీ నాయకులు కేవలం పదవుల కోసం తప్పా, ప్రజల కోసం పని చేయడం లేదని అందరికీ తెలిసిపోయింది. సోషల్ మీడియా ద్వారా బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. బీజేపీ అంటే బహుత్ ఝూఠా పార్టీగా అభివర్ణిస్తున్నారు. ఇక కాంగ్రెస్‌ను ప్రజలు పూర్తిగా మరిచిపోయారు. జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ తప్పా ఇతర పార్టీలకు చోటు లేదు.
ఓ పక్క ఎంపీగా.. మరో పక్క టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా పని చేయడం ఎలా అనిపిస్తున్నది?
సీఎం కేసీఆర్ ఆశీస్సులతో రెండుసార్లు ఎంపీగా భారీ మెజార్టీతో విజయం సాధించి, పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు సేవలందించే అవకాశం వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో నడిచి, ప్రజల సమస్యలు తెలుసుకున్నాం. ప్రజాప్రతినిధిగా, ఎంపీగా ప్రజల సమస్యలు పరిష్కరించే ఉన్నత అవకాశం దక్కింది. దీంతో పాటు జిల్లా అధ్యక్ష పదవి రావడం చాలా సంతోషంగా భావిస్తున్నా. ఓ పక్క ప్రజా సేవ, మరో పక్క పార్టీ శ్రేణులతో నిత్యం అందుబాటులో ఉండే అవకాశం దొరికింది. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు సహకారంతో అధ్యక్ష పదవికి పూర్తి న్యాయం చేస్తా.
ఉమ్మడి మెదక్ జిల్లాతో మీకు అనుబంధం చాలా ఉంది. ప్రస్తుత సిద్దిపేట జిల్లాలో విలీనమైన చేర్యాల(జనగామ), హుస్నాబాద్,మానకొండురు నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులతో సంబంధాలను ఎలా మెరుగుపరుచుకుంటారు ?
అవును.. ఉమ్మడి మెదక్‌తో చాలా అనుబంధం ఉంది. ఉద్యమంలో ఉమ్మడి జిల్లాలో పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో కలిసి పని చేశా. ప్రస్తుతం ఎంపీగా ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేశాం. సిద్దిపేట జిల్లాలోని మా సొంత నియోజకవర్గమైన దుబ్బాకతో పాటు సిద్దిపేట, గజ్వేల్‌లో పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులతో నాకు పాత అనుబంధమే ఉంది. ఇకపోతే చేర్యాల, హుస్నాబాద్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులతో మంచి పరిచయాలున్నాయి. గత ఎన్నికల్లో వారితో కలిసి పని చేశా. ఆ నియోజకవర్గాల్లో ప్రత్యేక దృష్టి సారించి, ఆ నియోజకవర్గాల వారితో కలిసి పార్టీ సమావేశాలు ఏర్పాటు చేస్తాం.
టీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తారు?
దేశంలో ఎక్కడా లేని సంక్షేమ, అభివృద్ధి పథకాలు మన తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారు. రాష్ట్రం ఏర్పాటైన అతికొద్ది సమయంలోనే ఎన్నో రకాల అభివృద్ధి పనులు చేపట్టారు. అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే రోల్ మోడల్‌గా రాష్ట్రం నిలిచింది. తెలంగాణ అంటే టీఆర్ఎస్.. టీఆర్ఎస్ అంటే కేసీఆర్..! తెలంగాణలో ఇంటింటికీ నల్లా నీళ్లు సరఫరా చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన మిషన్ భగీరథ పథకం దేశంలోనే ఆదర్శంగా నిలిచింది. ఈ పథకాన్నే బీజేపీ సర్కారు ‘హర్ ఘర్ జల్’ అని తీసుకొచ్చింది. ఇక కల్యాణలక్ష్మి పథకాన్ని కూడా కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు కాపీ కొడుతున్నాయి. ఇక రైతుబంధు పథకం మన రైతులందరి అదృష్టం. ఆ పథకంతో రైతులు సంతోషంగా ఉన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ భూములకు డిమాండ్ పెరిగింది. విపరీతంగా భూముల ధరలు పెరుగడానికి కారణం రైతుబంధు పథకం. జిల్లాలో ప్రాజెక్టులు నిర్మించడంతో ఇవాళ రైతులకు మంచి రోజులొచ్చాయి. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని జీడీపీ 2.5 మన తెలంగాణలో ఉంది. నీతి ఆయోగ్‌లో మన ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలకు ప్రశంసలు అందాయి. వీటిని బీజేపీ, మోదీ సర్కారు జీర్ణించుకోలేకపోతున్నది. తెలంగాణలో కేసీఆర్ సర్కారుకు పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేని ప్రధాని మోదీ, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఇందుకు ఇటీవల రాజ్యసభలో ప్రధాని తెలంగాణపై చేసిన అనుచిత వ్యాఖ్యలే నిదర్శనం. తెలంగాణ సర్కారు ప్రవేశ పెట్టిన సంక్షేమ, అభివృద్ధి పనులపై జిల్లా ప్రజలోల మంచి ఆదరణ ఉంది. సీఎం కేసీఆర్ పాలనను ప్రజలు కోరుకుంటున్నారు. రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి టీఆర్ఎస్ రాబోతున్నది. ప్రతి ఇంటికీ ఏదో ఒకరకమైన సంక్షేమ పథకం అందుతుందంటే ముఖ్యమంత్రే కారణం.