సిద్దిపేట, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ తొగుట: సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లా పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేయాలని అధికారులను సీపీ శ్వేత, అదనపు కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్ ఆదేశించారు. జిల్లాలోని మల్లన్నసాగర్ ప్రాజెక్టు జలాశయాన్ని ఈ నెల 23న సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేసేందుకు వస్తున్న దృష్ట్యా శుక్రవారం తొగుట మండలం తుక్కాపూర్‌లో ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో వారు పరిశీలించారు. హెలిప్యాడ్, పంపుహౌస్, డెలివరీ సిస్టర్న్, సమావేశ ప్రదేశాలను సందర్శించారు. శాఖల వారీగా చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించి, దిశానిర్దేశం చేశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ నెల 23న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పర్యటన ఉండనున్నదని సీపీ, అదనపు కలెక్టర్ తెలిపారు. తుక్కాపూర్‌లో డెలివరీ సిస్టర్న్ సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు సీఎం కేసీఆర్ చేరుకుంటారన్నారు. అనంతరం సొరంగ మార్గం ద్వారా భూగర్భంలో ఏర్పా టు చేసిన పంపుహౌస్ వద్దకు వెళ్లి మల్లన్నసాగర్ జలాశయంలోకి గోదావరి జలాలను ఎత్తిపోసే మోటర్లను ఆన్ చేస్తారన్నారు. అక్కడి నుంచి డెలివరీ సిస్టర్న్ వద్దకు వచ్చి జలాశయంలో గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు చేస్తారన్నారు. అనంతరం ప్రాజెక్టు బయట డెలివరీ సిస్టర్న్ కింది భాగంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ క్లోజ్డ్ మ్యానర్‌లో సమావేశం నిర్వహిస్తారన్నారు. కార్యక్రమం సాఫీగా జరిగేలా శాఖాపరంగా పటిష్ట భద్రత చర్యలు చేపడుతున్నామని సీపీ శ్వేత తెలిపారు. వీఐపీ, ప్రజాప్రతినిధులకు వేర్వేరుగా పార్కింగ్ స్థలాలు గుర్తించామన్నారు. కార్యక్రమం సజావుగా జరిగేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు, పోలీసు శాఖకు సహకరించాలన్నారు.
పర్యటనను విజయవంతం చేయాలి: అదనపు కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్
సీఎం కేసీఆర్ పర్యటన విజయవంతం చేయాల అదనపు కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్ సూచించారు. హెలిప్యాడ్ వద్ద ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. ఆర్అండ్బీ అధికారులు హెలిప్యాడ్‌ను తనిఖీ చేయాలన్నారు. వీవీఐపీల లంచ్ మెయింటనెన్స్‌ను శిక్షణ కలెక్టర్, డీఆర్డీవోలు సంయుక్తంగా చూడాలన్నారు. పార్కింగ్ స్థలాల్లో సివిల్ వర్క్ పనులను పీఆర్ ఈఈలు చూడాలన్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా ట్రాన్స్‌కో అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజాప్రతినిధులకు సం బంధిత శాఖల జిల్లా అధికారులు సోమవారం లోగా పాసులు అందేలా చూడాలన్నారు. వీఐపీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియాకు వేర్వేరుగా భోజనాలు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో కొవిడ్ నిబంధనలు అమలయ్యేలా జిల్లా వైద్యాధికారి చూడాలన్నారు. కార్యక్రమ వేదిక వద్ద మహిళలకు 3, పురుషులకు ఒక మొబైల్ టాయిలెట్ ఏర్పాటు చేయాలన్నారు. ఫైరింజిన్లు సిద్ధంగా ఉంచాలన్నారు. ప్రొటోకాల్ ప్రకారం సీటింగ్ ఆరెంజ్మెంట్స్ను రెవె న్యూ అధికారులు చూడాలన్నారు. అంతకుముందు ఐడీవోసీ మీటింగ్ హాల్లో జిల్లా అధికారులతో సీపీ శ్వేత, అదనపు కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్ సమావేశం నిర్వహించి, ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. వారి వెంట శిక్షణ కలెక్టర్ ప్రఫుల్ దేశాయి, ఆర్డీవోలు అనంతరెడ్డి, జయచంద్రారెడ్డి, విజయేందర్‌రెడ్డి, ఏసీపీలు, జిల్లా అధికారులు ఉన్నారు.