చిన్నకోడూరు, ఫిబ్రవరి 18 : మండలాన్ని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు సహకారంతో ఆదర్శంగా మార్చుకుందామని జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ అన్నారు. శుక్రవారం చిన్నకోడూరు మండల సాధారణ సర్వసభ్య సమావేశాన్ని ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో పలు శాఖలపై ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి చర్చించారు. వేసవి కాలం సమీపిస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్య లు చేపట్టాలని ఎంపీపీ సూచించారు. అనంతరం జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ మాట్లాడుతూ మంత్రి హరీశ్‌రావు మండలంపై ప్రత్యేక దృష్టి సారించి అన్నివిధాలా అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా పనిచేసి గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు. ‘మనఊరు -మన బడి’ కార్యక్రమంలో భాగంగా మండలంలోని 19 పాఠశాలలను ఎంపిక చేశామన్నారు. ఈ నెల 28న పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అనంతరం ఎంపీపీ మాణిక్యరెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ బర్త్‌డే సందర్భంగా రంగనాయకసాగర్ ఎడమ కాల్వ నుంచి చెరువులు, కుంటలకు నీటిని విడుదల చేసినట్లు చెప్పారు. రైతులు ఇతర పంటలను సాగు చేయాలన్నారు. సమావేశంలో ఎంపీడీవో శ్రీనివాస్, రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్ మేడికాయల వెంకటేశం, డీసీసీబీ జిల్లా డైరెక్టర్ రామచంద్రం, అల్లీపూర్ సొసైటీ చైర్మన్ సదానందంగౌడ్, సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
26న జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం
ఈ నెల 26న రెడ్డి సంక్షేమ భవన్లో జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా ప్రజాపరిషత్ సీఈవో రమేశ్ తెలిపారు. సమావేశానికి గౌరవ సభ్యులు జిల్లా అధికారులు, హాజరు కావాలని కోరారు.