సిద్దిపేట, ఫిబ్రవరి 6 : రైల్వేలైన్ నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం మరువలేనిదని రైల్వే శాఖ ఇప్పటికే కితాబిచ్చిందని, మనోహరాబాద్ రైల్వేలైను పనులు వేగవంతం చేయాలని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ఆదివారం సిద్దిపేటలోని క్యాంప్ కార్యాలయంలో రైల్వే, రెవెన్యూ, ఇరిగేషన్, ఇండస్ట్ట్రియల్, విద్యుత్ అధికారులతో రైల్వే పనుల ప్రగతిపై మంత్రి సమీక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ జిల్లా మనోహరాబాద్ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోందన్నారు. వీలైనంత త్వరగా ఈ మార్గంలో రైల్వేలైన్ పనులు పూర్తి చేయాలన్నారు. సిద్దిపేట పట్టణం మిట్టపల్లి శివారులో రైల్వే స్టేషన్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని రైల్వే అధికారులను కోరారు. కుకునూర్‌పల్లి రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనుల విషయంపై ఆర్‌అండ్‌బీకి భూమి అప్పగింత అంశాలను చర్చించారు. ఇండస్ట్ట్రియల్ భూమి లెవల్ చేసి, ఆ మట్టిని రైల్వే లైన్లకు ఉపయోగించాలని సూచించారు. దుద్దెడ సమీపంలో పౌల్ట్రీఫామ్ స్ట్రక్చర్ పేమెంట్ నిధుల మంజూరుకు త్వరలోనే ప్రభుత్వ ఆమోదం వస్తుందన్నారు. మిట్టపల్లి రైల్వేలైన్ కోసం పెండింగ్‌లో ఉన్న భూసేకరణను పూర్తిచేసి రైల్వే అధికారులకు అప్పగించాలని ఆర్డీవో, రెవెన్యూ అధికారులను మంత్రి ఆదేశించారు. జిల్లాలోని రిజర్వాయర్ల మీదుగా ఈ లైన్ వెళ్తున్నందున రిజర్వాయర్లలో పెంచే చేపలు ఇతర రాష్ర్టాలకు సరఫరా చేసే వెసులుబాటు ఉందన్నారు. నెలాఖరులోగా గొర్రెలు, పశువుల హాస్టల్స్‌ను ప్రారంభించేలా సన్నాహాలు చేయాలని పశుసంవర్ధక శాఖ అధికారి సత్య ప్రసాద్‌ను మంత్రి ఆదేశించారు. సమావేశంలో రైల్వే శాఖ ఈఈ జనార్దన్, ఇరిగేషన్ అధికారి విష్ణు, బాలసుందరం తదితరులు పాల్గొన్నారు.