సిద్దిపేట కమాన్, డిసెంబర్ 17: ఆ ఊరంతా ఆకుకూరలే పండిస్తారు. పెట్టుబడి తక్కువ.., లాభాలు ఎక్కువగా ఉన్న ఈ పంటలతో నష్టం అనేదే లేదని చెబుతున్నారు ఆ గ్రామం రైతులు. ఆకుకూరల సాగుతో రోజువారీగా ఆదాయం పొందవచ్చంటున్నారు సిద్దిపేట జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్న ఇమాంబాద్ రైతులు. ఎన్నో ఏండ్ల నుంచి ఆకుకూరలు పండిస్తూ పట్టణంలో విక్రయిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం రంగనాయక సాగర్ రిజర్వాయర్ రాకతో సాగునీటికి ఇబ్బందులు లేకపోవడంతో వారి పంట సాగు “మూడు పువ్వులు.., ఆరు కాయలు”గా సాగుతునున్నది. పుష్కల నీటివనరు ఉండడంతో తీరొక్క ఆకుకూరలు పండిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు…
వరి, మొక్కజొన్న ఇలా ఏ పంటలు సాగు చేసిన పంట కాలం ఎక్కువగా ఉంటుంది. పె ట్టుబడి భారం కూడా పెరుగుతుంది. ఆకుకూరల సాగుతో రైతులకు పెట్టుబడి భారం చాలా తక్కువగా ఉంటుంది. పంట కాలం నెలలోపే ఉంటుంది. దీంతో ఆదాయం రావాలం టే ఆకుకూరలైతేనే మేలని, ఏ రోజుకారోజు పంట పట్టణంలో విక్రయిస్తున్నారు మండల పరిధిలోని ఇమాంబాద్ రైతులు. ఇది సులభతరం గా మారిందని దీంతో ఊరంతా ఆకుకూరల పంటలే సాగు చేస్తున్నామని చెబుతున్నారు.
తీరొక్క ఆకుకూరలు
మన ఆరోగ్యాలకు ఆకుకూరలు ఎంతో ఉపకరిస్తాయి. కంటిచూపుతో పాటు మలబద్ధకం వంటి సమస్యలను ఆకుకూరలు నివారిస్తాయి. మార్కెట్లోనూ ఆకుకూరలకు మంచి డిమాండ్ ఉంది. పచ్చని ఆకుకూరలు ఆహారం తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు. అందుకనుగుణంగా ఇమాంబాద్లో తీరొక్క ఆకుకూరలను పండిస్తున్నారు. తోటకూర, పాలకూర, గంగావళికూర, సుక్కకూర, చిన్నాకుల కూర, పుంటికూర, మెంతి, కొత్తిమీర ఇలా రకరకాల ఆకుకూరలు పండిస్తున్నారు. ఏ రైతు పొలం చూసినా పచ్చని ఆకుకూరలతో కలకలలాడుతున్నాయి. పలువురు కొనుగోలుదారులు పొలాల వద్దకే వెళ్లి తాజా ఆకుకూరలు కొనుగోలు చేస్తున్నారు.
కూలీలకు ఉపాధి
గ్రామంలో ఆకుకూరలు సాగు చేస్తున్న రైతులు పనిచేయడానికి సరిపోక ఇతర కూలీలను సైతం పనికి తీసుకెళ్తారు. ఇలా తీసుకెళ్లడం వల్ల మరికొన్ని కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. ఏడాదంతా ఆకుకూరల సాగు ఇక్కడ చేపడుతారు కాబట్టి కూలీలకు ఏడాది పొడవునా ఉపాధి దొరుకుతుంది.
ఏండ్ల నుంచి కూరగాయలు సాగు చేస్తున్నాం..
మా కుటుంబ సభ్యులం చాలా ఏండ్ల నుంచి ఆకుకూరల పంటలు పండిస్తున్నాం. పెండ్లిళ్ల సీజన్ అయితే గిరాకీ బాగా ఉంటది. చేసుకున్నోళ్లకు చేసుకున్నంత ఆదాయం. ఆకుకూరల సాగు నెల పంటనే కాబట్టి నష్టం లేకుండా లాభం ఉంటది. మా కుటుంబం పనిచేసుకుంటూనే కూలీలతోను పనులు చేయిస్తాం.
రోజూ అకుకూరల పనే..
ప్రతిరోజూ మా కుటుంబ సభ్యులందరం ఇదే పనిచేస్తాం. ఏ రోజుకారోజు ఆదాయం వస్తది. ఏడాది పొడవునా పని ఉంటది. సిద్దిపేట పట్టణం దగ్గరనే ఉంటది కాబట్టి పొద్దున ఆకుకూరలు కట్టలు కట్టి అక్కడ అమ్ముకునే వారికి వేసి వస్తాం. మార్కెట్లో ధరలను బట్టి ఒకరు రోజుకు రూ.500 నుంచి వెయ్యి వరకు సంపాదించవచ్చు.