సిద్దిపేట, నవంబర్ 22: సిద్దిపేట మరో రాష్ట్ర స్థాయి క్రీడలకు అతిథ్యమివ్వనున్నది. తెలంగాణ అంతర్ జిల్లా సీనియర్ మహిళల సాఫ్ట్‌బాల్ చాంపియన్ షిప్ పోటీలు జరుగనున్నాయి. స్థానిక సిద్దిపేట మినీ స్టేడియం ఆవరణంలోని డిగ్రీ కాలేజీ మైదానంలో పోటీలు నిర్వహిస్తారు. మంగళవారం నుంచి ఈ నెల 25వతేదీ వరకు జరుగనున్న పోటీలకు 20 జిల్లాల నుంచి 320 మంది క్రీడాకారులు,40 మంది కోచ్‌లు, మేనేజర్లు హాజరుకానున్నారు. సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ప్రతినిధులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 20 జిల్లాల నుంచి జట్లు వస్తుండడంతో మూడు మైదానాలను సిద్ధం చేశారు. పోటీల నిర్వహణ సజావుగా సాగేందుకు గ్రౌండ్, భోజన, వసతి, మెడికల్, స్టేజీ నిర్వహణ, కమిటీలు వేశారు. వీరితో పాటు 20 మంది టెక్నికల్ అధికారులు, 25 మంది వ్యాయామ ఉపాధ్యాయులు, 20 మంది వలంటీర్లు ఇక్కడ సేవలు అందించనున్నారు. క్రీడా కారులకు మినీ స్టేడియం పక్కన గల దర్గాలో వసతి సౌకర్యం ఏర్పాటు చేశారు. ఈ టోర్నమెంట్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు.
అన్ని ఏర్పాట్లు పూర్తి..
రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు సిద్దిపేటలోని డిగ్రీ కాలేజీ మైదానంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నేతి కైలాసం, కార్యదర్శి రేణుక, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కార్యదర్శి మురళీధర్ తెలిపారు. సోమవారం వారు విలేకరులతో మాట్లాడారు. ఈ టోర్నీ నిర్వహణకు ఆవకాశం కల్పించిన రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు వసంతకుమార్, కార్యదర్శి శోభన్‌బాబుకు ధన్యవాదలు తెలిపారు. పోటీలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, మున్సిపల్ చైర్పర్సన్ మంజులా రాజనర్సు, స్పోర్ట్స్ క్లబ్ కన్వీనర్ పాల సాయిరామ్‌కు ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో శ్యామ్‌సుందర్, ఎస్జీఎఫ్ సెక్రటరీ భిక్షపతి, పెటా టీఎస్ అధ్యక్షుడు సతీశ్, మహేశ్, వెంకటేశ్, నవీన్, భరత్‌రెడ్డి, సతీశ్‌రాజు పాల్గొన్నారు.